భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలుచేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లాలో ఇద్దరు
సీఐల బదిలీలు
ఇల్లెందు/కొత్తగూడెంటౌన్: జిల్లాలో ఇద్దరు సీఐలను బదిలీ చేస్తూ వరంగల్ రేంజ్ మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టేకులపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తాటిపాముల సురేష్‌ను ఇల్లెందు పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా, ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణపై సస్పెన్షన్ ఎత్తివేసి టేకులపల్లి సీఐగా నియమించారు.
లక్ష టన్నుల బొగ్గు
ఉత్పత్తికి అంతరాయం
నిలిచిన 15 లక్షల క్యూబిక్ మీటర్ల
ఓబీ వెలికితీత
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ వార్షిక లక్ష్య సాధనలో భాగంగా రోజుకు 1.72 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి శ్రమిస్తుండగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అంతరాయం ఏర్పడుతోంది. సింగరేణి వ్యాప్తంగా రోజుకు 1.72 లక్షల టన్నులకు గాను రెండు రోజుల నుంచి 72 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదవుతోంది. దీంతో రోజుకు లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి స్తంభించగా, 18 ఓసీల్లో రోజుకు 15లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్(ఓబీ) వెలికితీత కూడా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా, ఎడతెరిపి లేని వర్షంతో ఓసీల్లోని హాల్‌రోడ్లన్నీ బురద మయం కావడమే కాక భారీగా నీరు చేసింది. దీంతో ప్లాన్‌టూన్ పంపులు, మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు.
రామాలయం
ఈఓకు ఉద్యోగోన్నతి ?
భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈఓ ఎల్.రమాదేవికి ఉద్యోగోన్నతి లభించినట్లు సమాచారం. డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న ఆమెకు 2023 ఫిబ్రవరిలో ఆలయ ఈఓగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అనంతరం కొద్ది నెలలకే ఫుల్ ఇన్‌చార్జిగా జీఓ విడుదల చేశారు. కాగా డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న రమాదేవి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అయితే ఇక్కడ ఈఓగా కొనసాగిస్తారా లేక మరో చోటకు బదిలీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం