
మునగ, నేరేడు మొక్కలు నాటండి
టేకులపల్లి మండల పర్యటనలో కలెక్టర్
టేకులపల్లి : పాఠశాలలు, ఆస్పత్రుల ఆవరణల్లో మునగ, నేరేడు మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలోని పాతతండా ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మరింత మెరుగైన బోధన అందేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ జగన్, హెచ్‌ఎం లక్ష్మణ్‌కు సూచించారు. ఆ తర్వాత సులానగర్ పీహెచ్‌సీని సందర్శించారు. ఓపీ, ఐపీ ఎలా ఉన్నాయని ఆరా తీశారు. పేషంట్లకు అందుతున్న సేవలు, మందుల నిల్వలు, ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నెలలు నిండిన గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు, మైదాన ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ఆస్పత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగాయని, పాములు తిరుగుతున్నాయని, కోతుల బెడద ఉందని స్థానికులు కలెక్టర్ దృష్టికి తేగా.. పంచాయతీ సిబ్బంది సహకారంతో తొలగించాలని వైద్యులను ఆదేశించారు. కోతుల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు.