
ఎంసీసీ, పీపుల్స్‌వార్ విలీనంతో మావోయిస్టు పార్టీ ఏర్పాటు
పార్టీలో తగ్గుతున్న ఎంసీసీ ప్రాబల్యం
ఆపరేషన్ కగార్‌తో అంతమైన ఆంధ్రప్రదేశ్ నాయకత్వం
గాజర్ల గణేశ్‌తో మొదలైన తెలంగాణ నేతల వేట
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీని సమూలంగా నిర్మూలించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తెలంగాణ నేతలే ప్రధాన అడ్డుగోడగా ఉన్నారు. దీంతో తెలంగాణ నేతలను లక్ష్యంగా చేసుకుని స్పెషల్ ఆపరేషన్లకు భద్రతా దళాలు శ్రీకారం చుట్టాయి. చిక్కబడ్డ అడవి, వర్షాలను లెక్క చేయకుండా బస్తర్ జంగళ్లను జల్లెడ పడుతున్నాయి.
సమ్మిళిత నాయకత్వం..
దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో బలమైన సాయుధ విప్లవ పోరాట పంథాను అమలు చేస్తున్న పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) 2004లో విలీనమై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఏర్పాటైంది. అప్పటి నుంచి పదేళ్ల పాటు ఉత్తర, దక్షిణ, తూర్పు భారత దేశాలకు సంబం«ధించిన వారి నేతృత్వంలో మావోయిస్టులు వేగంగా విస్తరించారు. దేశంలో పది రాష్ట్రాల్లో ప్రభావం చూపించే దశకు చేరుకున్నారు.
పశుపతి (నేపాల్)టు తిరుపతి వరకు గల ప్రాంతాన్ని రెడ్ కారిడార్‌గా ప్రకటించడంతో పాటు బస్తర్‌లో జనతన సర్కార్ పేరుతో సమాంతర రాజ్యాన్ని నడిపించడం ప్రారంభించారు. అయితే మావోయిస్టుల విస్తరణను అడ్డుకునేందుకు మొదట సల్వాజుడుంను ముందుకు తెచ్చి భంగపడిన కేంద్రం.. ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్‌హంట్‌తో మొదలుపెట్టి వరుసగా పలు ఆపరేషన్లు అమలు చేస్తోంది.
తగ్గిన ఎంసీసీ నేతలు
సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటైనప్పుడు కేంద్ర కమిటీలో 34 మందికి పైగా సభ్యులు ఉండేవారు. ఇందులో పీపుల్స్‌వార్, ఎంసీసీ నేతలకు సముచిత స్థానం లభించింది. కానీ ప్రభుత్వాలు చేపట్టిన యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో మొదట ఎంసీసీకి చెందిన నేతలు ఎక్కువ మంది అరెస్ట్ కావడం లేదా ఎన్‌కౌంటర్లలో, కొందరు అనారోగ్య కారణాలతో చనిపోయారు.
2006 నుంచి 2025 వరకు పరిశీలిస్తే సుశీల్‌రాయ్ (2005), జాంటూ ముఖర్జీ (2006), ప్రమోద్ మిశ్రా (2008), కోబడ్ గాంధీ (2009), అమితాబ్ బాగ్చీ (2009), జగదీశ్‌యాదవ్ (2011), నారాయణ్ సన్యాల్ (2011), అరవింద్ (2018), ప్రశాంత్‌బోస్ (2021), ప్రయాగ్ మాంఝీ (2025).. మొత్తంగా పదిమంది అగ్రనేతలు సాయుధ విప్లవ ఉద్యమానికి దూరమయ్యారు.
ఇదే సమయంలో పీపుల్స్‌వార్‌కు చెందిన వారిలో చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ (2010), మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ 2011లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మృతిచెందగా.. రెండేళ్ల క్రితం రామకృష్ణ, కటకం సుదర్శన్ అనారోగ్య కారణాలతో మరణించారు. దీంతో దశాబ్ద కాలంగా సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంలో ఎంసీసీ నేతల ప్రాబల్యం తగ్గి తెలుగు రాష్ట్రాల నుంచి పుట్టుకొచి్చన పీపుల్స్‌వార్ నాయకత్వమే కీలకంగా మారింది.
టార్గెట్ చేరాలంటే..
ఆపరేషన్ కగార్ ప్రభావంతో జనవరిలో చలపతి, మేలో నంబాల కేశవరావు, జూన్‌లో తెంటు సుధాకర్ వంటి అగ్రనేతలు చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీలో ఏపీకి చెందిన టాప్ లీడర్ల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే 20 ఏళ్ల మావోయిస్టు పార్టీ చరిత్రలో తీవ్రమైన ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొంటూ గెరిల్లా పంథాలో సాయుధ విప్లవ పోరాటాన్ని నడిపించడంలో తెలంగాణ నేతలు మిగిలిన వారి కంటే మిన్నగా ఉన్నారనేది ప్రభుత్వ వర్గాల అంచనా. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన అగ్రనేతల ‘టార్గెట్’ను ఛేదిస్తేనే ‘2026 మార్చి 31’నాటికి అనుకున్న లక్ష్యం చేరగలమని, లేదంటే పరిస్థితి మరోరకంగా ఉంటుందనే ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో ఉంది.
గణేశ్‌తో మొదలు..
ఇటీవల వర్షాలతో పాటు చిక్కబడిన అడవులను సైతం లెక్క చేయకుండా భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈనెల 8న చేపట్టిన గాలింపు చర్యల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్ నేలకొరిగారు. రాబోయే రోజుల్లో కేంద్ర కమిటీలో ఉన్న పది మంది తెలంగాణ నేతలు టార్గెట్‌గా చేపట్టే ఆపరేషన్లు ఉధృతంగా సాగనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్లకు వెళ్తున్న జవాన్లు మొబైల్ ఫోన్ల వాడకంపై ఆంక్షలు విధించినట్టు సమాచారం.