
తెరపైకి బైపాస్?
ఏడాదిగా మగ్గుతున్నాయి..
కొత్తగూడెం – తల్లాడ మార్గాన్ని జాతీయ రహదారిగా విస్తరించాలని కేంద్రాన్ని కోరినట్టు 2024 జూన్ 29న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అందులో భాగంగా విజయవాడ – జగ్‌దల్‌పూర్ (ఎన్‌హెచ్ 30), దేవరపల్లి – ఖమ్మం (ఎన్‌హెచ్ 365బీబీ)లను కలుపుతూ కొత్తగూడెం – తల్లాడ – వైరా – జగ్గయ్యపేట వరకు ఉన్న 100 కి.మీ. రోడ్డును జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. అంతేకాదు.. గతంలోనే ఎన్‌హెచ్ హోదా వచ్చిన సారపాక – ఏటూరునాగారం మార్గానికి నంబర్ కేటాయించడంతో పాటు భద్రాచలం – బూర్గంపాడు – వేలేరుపాడు – అశ్వారావుపేట – రాజమండ్రికి బదులు పాల్వంచ – దమ్మపేట రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు మంత్రి వెల్లడించారు. అయితే ఏడాది గడిచినా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదు.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర వ్యాప్తంగా రెండు వరుసలుగా ఉన్న 14 జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జిల్లాకు సంబంధించి విజయవాడ – జగ్‌దల్‌పూర్ ఎన్‌హెచ్ 30కి చోటు దక్కింది. అయితే జిల్లాలోని ఇతర జాతీయ రహదారుల విస్తరణ, ప్రతిపాదనలు చాలా కాలంగా పెండింగ్‌లోనే ఉంటున్నాయి.
త్వరలో ‘నాయ్’ సర్వే..
విజయవాడ – జగదల్‌పూర్(ఎన్‌హెచ్ – 30) జాతీయ రహదారి వీఎం బంజర సమీపంలో మొదలై భద్రాచలం మీదుగా జగ్‌దల్‌పూర్ వెళ్తుంది. పదిహేనేళ్లుగా ఈ రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో చివరి దశకు చెందిన కిన్నెరసానిపై రెండో వంతెన, భద్రాచలం పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ఇప్పుడు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. గోదావరిపై రెండో వంతెన, కొత్తగూడెంలో ముర్రేడు, గోధుమవాగులపై వంతెనలు గతేడాదే అందుబాటులోకి వచ్చాయి. తొలిదశ విస్తరణ సమయానికే రుద్రంపూర్ – కొత్తగూడెం – పాల్వంచ – పెద్దమ్మగుడి వరకు నాలుగు వరుసలుగా రోడ్డు ఉంది. ఎన్‌హెచ్ 30 మార్గంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రుద్రంపూర్ నుంచి భద్రాచలం వరకు ఉన్న రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని తాజాగా నిర్ణయించారు. అందులో భాగంగా భారీ వాహనాలు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోకి రాకుండా భద్రాచలం వైపు వెళ్లేలా కొత్తగూడెం బైపాస్ రోడ్డుకు తాజా విస్తరణలో చోటు కల్పించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన అలైన్‌మెంట్‌పై త్వరలో సర్వే చేపట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (నాయ్) సిద్ధమవుతోంది.
నిర్మాణ పనుల్లో జాప్యం
హైదరాబాద్ – కొత్తగూడెం మార్గానికి నాలుగేళ్ల క్రితం 930పీ నంబర్‌తో ఎన్‌హెచ్ హోదా దక్కింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో గౌరారం వద్ద మొదలయ్యే ఈ రోడ్డు తొర్రూరు – మహబూబాబాద్ – ఇల్లెందు మీదుగా కొత్తగూడెం (ఇల్లెందు క్రాస్‌రోడ్డు) వరకు ఉంటుంది. ఇందులో కేవలం ఇల్లెందు మండలం నెహ్రూనగర్ నుంచి కొత్తగూడెం వరకు 54 కి.మీ. రోడ్డును ఫోర్‌లేన్‌గా నిర్మించాలని ముందుగానే నిర్ణయించారు. అయితే అటవీ అనుమతులు, భూసేకరణ, టెండర్ల ప్రక్రియలో జాప్యం కారణంగా ఈ పనులు ఇంతవరకూ మొదలే కాలేదు.
గోదావరికి ఇరువైపులా..
భద్రాచలం – వాజేడు రోడ్డును జాతీయ రహదారిగా విస్తరించాలని ఏజెన్సీ వాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తిస్తే జగదల్‌పూర్ – విజయవాడ ఎన్‌హెచ్ 30, హైదరాబాద్ – భూపాలపట్నం ఎన్‌హెచ్ 161 కలుస్తాయి. ఇప్పటికే గోదావరికి కుడి వైపున సారపాక – ఏటూరునాగారం రోడ్డుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రం సానుకూలంగానే ఉంది. నదికి ఎడమ వైపున భద్రాచలం – వాజేడు రోడ్డుకు కూడా జాతీయ హోదా ఇప్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దీంతో గోదావరి తీరానికి రెండు వైపులా రోడ్డు రవాణా సౌకర్యం మెరుగవడంతో పాటు భవిష్యత్‌లో జల రవాణాకు కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఎన్‌హెచ్ 30 విస్తరణకు కేంద్రం సానుకూలం
రుద్రంపూర్ – భద్రాచలం మధ్య ఫోర్ లేన్ రోడ్డు
కొత్తగూడెం కార్పొరేషన్ చుట్టూ రానున్న బైపాస్..
ప్రతిపాదనల్లోనే కొత్త జాతీయ రహదారులు
ఎన్‌హెచ్ 930పీ పనుల్లో మాత్రం కనిపించని పురోగతి