
బరువెక్కిన ఎరువు
● పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు ● డీఏపీకి కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ రాయితీ ● కొనుగోలుకు మొగ్గు చూపుతున్న రైతులు
బూర్గంపాడు: కాంప్లెక్స్ ఎరువుల ధరలు క్రమేపీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ వ్యవసాయ సీజన్‌లో ధరల పెంపుతో రైతులపై అదనపు భారం పడుతోంది. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువుల్లో డీఏపీకి కేంద్ర ప్రభుత్వం రాయితీ కొనసాగిస్తోంది. దీంతో ఈ రెండు ఎరువుల ధరలు మాత్రమే ప్రస్తుతం రైతులకు కొంతమేర అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ప్రైవేట్ డీలర్లకు మార్క్‌ఫెడ్ నుంచి యూరియా సక్రమంగా సరఫరా కావడం లేదు. పీఏసీఎస్‌ల్లో మాత్రమే యూరియా అందుబాటులో ఉంటోంది. ప్రస్తుతం రైతులు పత్తి, వరి పంటలకు యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. అయితే ప్రైవేటు డీలర్ల వద్ద డీఏపీ కూడా అందుబాటులో ఉండడం లేదు. కొందరు డీలర్ల వద్ద ఉన్నా డీఏపీ కావాలంటే ఇతర ఎరువులు కొనాలంటూ లింక్ పెడుతున్నారు. ఐదు బస్తాల డీఏపీ కావాలంటే ఒక బస్తా క్యాల్షియం లేదా పొటాష్, లేదంటే నానో డీఏపీ, నానో యూరియా కొనాలంటూ షరతు విధిస్తున్నారు. ఇదేంని ప్రశ్నిస్తే తమకు డీఏపీ సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లే ఇలా నిబంధనలు పెడుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం యూరియా, డీఏపీకి డిమాండ్ పెరగడంతో కొందరు ప్రైవేటు డీలర్లు డీఏపీ బస్తాపై రూ. 50 అదనంగా వసూలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రాయితీ పోగా రూ.1,350కి విక్రయించాల్సి ఉండగా ప్రస్తుతం రూ. 1400 చొప్పున అమ్ముతున్నారు.
చుక్కలనంటుతున్న ధరలు..
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో ఇప్పటివరకు 1.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మరో 35 వేల ఎకరాల్లో సాగువుతందని అంచనా. వర్షాభావ పరిస్థితుల్లో కొన్ని మండలాల్లో ఆలస్యమైంది. వరి సుమారు 1.85 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంటున్నారు. గత పదిరోజులుగా వరి నాట్లు వేస్తున్నారు. నాట్లకు ముందే దుక్కిలో డీఏపీ వేస్తారు. పత్తిపంటకు కూడా తొలివిడత డీఏపీ, యూరియా కలిపి వేస్తున్నారు. ఈ తరుణంలో డీఏపీ, యూరియా ఎరువులు దొరకడం కొంత ఇబ్బందిగా మారింది. డీఏపీకి బదులుగా వేరే ఇతర కాంప్లెక్స్ ఎరువులు వేయాలంటే వాటి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గతేడాది రూ.1,300 ఉన్న 20:20:0:13 బస్తా ధర ఇప్పుడు రూ.1,400కు పెరిగింది. 10:26:26 బస్తా ధర గతేడాది రూ.1,470 ఉండగా ఇప్పుడు రూ.1,800కు చేరింది. 14:35:14 బస్తా ధర రూ. 1,700 నుంచి రూ.1,800కు పెరిగింది. గతేడాది రూ.1,535 ఉన్న పొటాష్ ధర ఇప్పుడు రూ. 1,900కు చేరింది. 15:15:15 ఎరువుల బస్తా ధర రూ.1,450 నుంచి రూ.1,600కు పెరిగింది. సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూ. 580 నుంచి రూ.640కి చేరింది. ఇలా కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో రైతులు తొలి విడతలో డీఏపీ వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో డీపీపీ దొరకకపోవడం, దొరికినా ఇతర ఎరువులు అంటగడుతుండడంతో వారికి తలకు మించిన భారంగా మారింది.
ఇతర ఎరువులు అంటగడుతున్నారు
డీఏపీ కొనాలంటే దాంతో పాటు ఇతర ఎరువులు కూడా అంటగడుతున్నారు. ఐదు బస్తాల డీఏపీ కొనాలంటే ఒక బస్తా క్యాల్షియం కొనాల్సిందేనని వ్యాపారులు చెబుతున్నారు. అవసరం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కూడా కొనాల్సి వస్తోంది. మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు బాగా పెరగడంతో డీఏపీనే వేస్తున్నాం.
– యడమకంటి నర్సింహారెడ్డి, రెడ్డిపాలెం
‘నానో’పై అవగాహన కల్పించాలి..
కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం, యూరియా కూడా సరిగా దొరకకపోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఈ తరుణంలో వ్యవసాయ అధికారులు నానో యూరియా, నానో డీఏపీ వినియోగించాలని రైతులకు సూచిస్తున్నారు. అయితే ద్రవరూప ఎరువుల వినియోగంపై పెద్దగా ఆసక్తి లేని రైతులు గుళికల ఎరువులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరముందని పలువురు అంటున్నారు.

బరువెక్కిన ఎరువు