
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): వర్షాలు పెరుగుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ వైద్య శాఖాధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా అవసరమైనంత మేరకు ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా తక్షణమే స్పందించేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటి నిల్వలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తవ్వి దోమల వ్యాప్తిని నివారించాలని సూచించారు. యూరియా వంటి కీలక ఎరువుల సరఫరా విషయంలో రైతుల్లో ఆందోళన కలగకుండా ఉండేందుకు ప్రతి ఎరువుల దుకాణం ఎదుట అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలు ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొద్దని కోరారు. అవసరమైతే డిమాండ్‌కు అనుగుణంగా మరింత స్టాక్ సమకూర్చేందుకు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరభ్‌శర్మ, సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబూరావు, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, ఇరిగేషన్ ఈఈ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్