● మాడ వీధుల విస్తరణకు ఇళ్లు, దుకాణాల కూల్చివేత ● రెండు నెలలు గడిచినా ఇంకా తొలగించని అధికారులు ● భూ సేకరణ పూర్తయితేనే రామాలయ అభివృద్ధి పనులు..
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి తొలుత మాడ వీధుల విస్తరణ చేపట్టారు. ఆలయానికి రెండు వైపులా ఉన్న ఇళ్లు, దుకాణాల యజమానులకు నష్టపరిహారం అందజేశారు. గత మే నెల 25 నుంచి సదరు దుకాణాలు, ఇళ్లను తొలగించి, స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ కూల్చి రెండు నెలలు గడుస్తున్నా శిథిలాలు తొలగించకపోవడంతో ఆలయానికి రెండు వైపులా గుట్టల్లా దర్శనమిస్తున్నాయి. వీవీఐపీలు ఎంట్రన్స్, తూర్పు మెట్ల వైపు లడ్డూ కౌంటర్లకు వరకు అడ్డుగా ఉన్నాయి.
రోడ్లపై శిథిలాలు.. భక్తులకు ఇక్కట్లు
దేవస్థానం తూర్పు, ఉత్తర దిక్కుల్లో సాధారణంగా వీధులు చాలా ఇరుకుగా ఉంటాయి. ఇటీవల కాలంలో రామాలయానికి భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రోడ్లపై శిథిలాలు ఉండటంతో స్వామివారి దర్శనానికి వెళ్లే వృద్ధులు, దివ్యాంగులు, వీఐపీలు ఇబ్బంది పడుతున్నారు. ఇటువైపు వచ్చే కార్లు, ఆటోలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. కిందివైపు వెళ్లే మార్గం మూసివేయడంతో ఇక్కడే వాహనాలను మళ్లించాలన్నా, వాటి నడుమనే భక్తులు దర్శనానికి వెళ్లాలన్నా ఇక్కట్లు తప్పడంలేదు. తోపుడు బండ్లకు చోటు లేకపోవడంతో చిరువ్యాపారులు సైతం ఉపాధి కోల్పోతున్నారు.
ఆ నాలుగు ఇంకా కూల్చలే..
మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం భూ సేకరణ, ఇతర పనులకు తొలి విడతగా రూ.60.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో భూ సేకరణ కోసం 40 కుటుంబాలకు రూ.34.45 కోట్ల పరిహారం కేటాయించారు. 32 మంది బాధితులు నష్టపరిహారం పాక్షికంగా తీసుకుని ఇళ్లను ఖాళీ చేశారు. మరో ఎనిమిది కుటుంబాల వారు అధిక నష్టపరిహారం డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు పలు దఫాలు చర్చించి, పరిహారం పెంచడంతో ఖాళీ చేసేందుకు ఒప్పుకున్నారు. కానీ భూ సేకరణ మాత్రం పూర్తి కాలేదు. ఆ ఇళ్ల భవనాలు అలాగే ఉండగా, అందులో వ్యాపారాలను సైతం కొనసాగిస్తున్నారు. మాడ వీధుల విస్తరణకు అడ్డుగా ఉన్న ఆ ఇళ్లను కూల్చాలని, ఇప్పటికే కూల్చిన శిథిలాలను తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
వారం రోజుల్లో పూర్తి చేస్తాం
భక్తుల ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. రెండు, మూడు రోజుల్లో మిగిలిన ఇళ్లను కూల్చే పనులు ప్రారంభమవుతాయి. అనంతరం ఆ శిథిలాలను తొలగించి దేవస్థానానికి అప్పగిస్తాం. వారం రోజుల్లో భూ సేకరణ ప్రక్రియ పూర్తవుతుంది.
– కొల్లు దామోదర్ రావు, ఆర్డీఓ, భద్రాచలం
భూ సేకరణ పూర్తయితేనే..
రెవెన్యూ అధికారులు శిథిలాలు తొలగించి ఆ భూములను ఆలయానికి అప్పగించాలి. ఆ తర్వాతే అభివృద్ధి పనులు మొదలవుతాయి. మాడ వీధుల విస్తరణ పూర్తయితేనే మాస్టర్‌ప్లాన్ రూపకల్పన, నిధుల విడుదల జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
శిథిలాలు ఎప్పుడు తొలగిస్తారో..?