
రెండేళ్ల బాలుడికి పాముకాటు
కరకగూడెం: ఓ మహిళ పొలం పనులకు వెళ్తూ తన రెండేళ్ల మనవడిని వెంటబెట్టుకెళ్లగా ఆ చిన్నారిని పాముకాటు వేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన ఊకే సారయ్య – నాగమణి దంపతుల కుమారుడు విక్రం ఆదిత్యను మంగళవారం ఉద యం ఆయన నాయనమ్మ పొలం పనులకు తీసుకెళ్లింది. సమీపాన బాబు ను పడుకోబెట్టి ఆమె పనుల్లో నిమగ్నం కాగా చిన్నారిని పాము కాటు వేయడంతో నురగలు కక్కుతూ స్పృహకోల్పోయాడు. దీంతో స్థానికుల సహకారంతో కారు లో పినపాక పీహెచ్‌సీకి తీసుకెళ్లగా వైద్యాధికారులు దుర్గా భవాని, కారం మధు చికిత్స చేశారు. ఆతర్వాత 108 వాహనంలో మణుగూరు ఆస్పత్రికి అక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స చేస్తున్నారు. అయితే, బాలుడి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉందని సమాచారం.
మద్యం మత్తులో
పురుగులమందు తాగి వ్యక్తి మృతి
ములకలపల్లి: మద్యం మత్తులో పురుగులమందు సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజశేఖర్ కథనం మేరకు.. మొగరాలగుప్ప గ్రామానికి చెందిన రాములమ్మకు, కొమ్ముగూడెంనకు చెందిన గడ్డం భద్రం (57)తో వివాహం కాగా.. ఇల్లరికం వచ్చి మొగరాలగుప్పలో ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. భద్రం రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. పలుమార్లు కుటుంబీకులు మద్యపానం ఆపేయాలని కోరినా ఫలితం లేకపోయింది. ఈ నెల 5వ తేదీన అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన భద్రం.. భార్య రాములమ్మ అన్నం తెచ్చేలోగానే ఇంటి వెనుకకు వెళ్లి, పురుగలుమందు డబ్బాను మద్యం బాటిల్‌గా భావించి సేవించాడు. కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.