శిథిల
బడి..
చర్ల: మండలంలోని బోదనెల్లి పంచాయతీ పరిధిలోని చింతగుప్ప పూర్తిగా గిరిజనులే నివసించే గ్రామం. దీంతో అక్కడ సుమారు 40 ఏళ్ల క్రితం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జీవీవీకే(గిరిజన విద్యా వికాస కేంద్రం) కోసం భవనం నిర్మించి, ప్రైవేట్ టీచర్లతో బోధన కొనసాగించారు. ఆ తర్వాత జీపీఎస్(గిరిజన ప్రాథమిక పాఠశాల)గా అప్‌గ్రేడ్ చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించారు. అయితే నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం పదేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరుకోగా.. అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మరింత దెబ్బతిని స్లాబు పెచ్చులూడి పడుతున్నాయి.
20 మందికి పైగా విద్యార్థులు..
గ్రామంలో 48 కుటుంబాలు ఉండగా ఈ ఏడాది 1 నుంచి 5వ తరగతి వరకు 20 మందికి పైగా విద్యార్థులు జీపీఎస్‌లో చదువుతున్నారు. శిథిలమైన భవనాన్ని కూల్చాల్సి ఉన్నా ప్రత్యామ్నాయం లేకపోవడంతో స్థానిక అధికారులు అందులోనే బడిని కొనసాగిస్తున్నారు. గత పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో స్లాబు నుంచి లోపలికి నీరు వస్తుండడంతో పాటు పైపెచ్చులు ఊడి పడుతుండగా విద్యార్థులను బడికి పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. అయితే తమ పిల్లలు చదువులో వెనుకబడతారనే భయంతో ప్రత్యామ్నాయం వెదుకుతుండగా.. పాఠశాల సమీపంలో ఓ వ్యక్తి గోడలు నిర్మించకుండా స్లాబు వేసిన ఇల్లు కనిపించడంతో గత వారం రోజులుగా అందులో పాఠశాల నిర్వహిస్తున్నారు. కాగా, ఐటీడీఏ పీఓ గతేడాది ఈ పాఠశాలను సందర్శించి నూతన భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికై నా నిధులు మంజూరు చేసి పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
చింతగుప్పలో శిథిలమైన
గిరిజన సంక్షేమ పాఠశాల
పెచ్చులూడి పడుతున్న స్లాబు..
పిల్లలను పంపేందుకు తల్లిదండ్రుల నిరాకరణ
నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో తాత్కాలిక నిర్వహణ
నాలుగైదు ఏళ్లుగా భయపడుతున్నాం
పాఠశాల భవనం పూర్తిగా పాడైంది. నాలుగైదేళ్లుగా భయపడుతూనే పిల్లలను బడికి పంపించాం. ఈ ఏడాది మరింత శిథిలం కావడంతో ఇక పంపించొద్దనుకున్నాం. స్లాబు ఎప్పుడు కూలిపడుతుందో తెలియని పరిస్థితి ఉంది.
– కాకా నాగేశ్వరావు, చింతగుప్ప
ఇల్లు ఇవ్వాలని బతిమిలాడాం
మా ఊర్లో బడి పూర్తిగా శిథిలమైంది. పిల్లలను ఇక పంపించొద్దు అనుకున్నాం. అయితే మా బంధువు ఇల్లు కడుతుంటే గోడలు లేకున్నా సరే కొన్ని రోజులు బడికి ఇవ్వాలని కోరాం. ఆయన ఒప్పుకోవడంతో పిల్లలను పంపిస్తున్నాం. ఇకనైనా కొత్త భవనం నిర్మించాలి.
– సోడి రమేష్, గ్రామస్తుడు
సమస్యల ఒడి..!
సమస్యల ఒడి..!
సమస్యల ఒడి..!