సజావుగా ఆరోగ్య కార్యక్రమాల అమలు | - | Sakshi
Sakshi News home page

సజావుగా ఆరోగ్య కార్యక్రమాల అమలు

Jul 5 2025 6:20 AM | Updated on Jul 5 2025 6:20 AM

సజావు

సజావుగా ఆరోగ్య కార్యక్రమాల అమలు

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను సజావుగా అమలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జయలక్ష్మి సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆమె ఫ్రంట్‌లైన్‌ ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడారు. నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధులు, సికిల్‌ సెల్‌ అనీమియా కోసం కమ్యూనిటీ స్క్రీనింగ్‌పై దృష్టి సారించాలని, శిశువులకు యాంటెనటల్‌ కేసుల నమోదు చేయాలని, రోగనిరోధక కవరేజీని వందశాతం సాధించాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ స్పందన, డాక్టర్‌ పుల్లారెడ్డి, సీహెచ్‌ఓ నాగభూషణం, బి.సోమ్లా నాయక్‌, జిల్లా స్థాయి పర్యవేక్షకులు పాల్గొన్నారు.

ఫోన్లు తనిఖీ..

పోలీసులకు ఫిర్యాదు

ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియా కార్మిక సంఘాల నేతల ఫోన్లు విజిలెన్స్‌ బృందం తనిఖీ చేసిన విషయమై ఓ కార్మిక సంఘం నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం పోలీసులు అటు కార్మిక సంఘాల నేతలను, సింగరేణి ఎస్‌అండ్‌పీసీ నేతలను పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి వాకబు చేశారు. రెండు రోజుల కిందట రాత్రి సమయంలో డ్యూటీలో ఉన్న ఇద్దరు వేర్వేరు కార్మిక సంఘాల నేతల ఫోన్లు సింగరేణి విజిలెన్స్‌ విభాగం టీంసభ్యులు తనిఖీ చేశారు. ఓ నేత ఫోన్‌ నుంచి డేటా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తెలిసింది. ఈ తరుణంలో డ్యూటీలో ఉన్న తన ఫోన్‌ అనుమతి లేకుండా స్వాధీనం చేసుకుని తనిఖీ చేయడంపై సదరు నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు రహస్యంగా సింగరేణి అధికారులను విచారిస్తున్నారు.

చేయూత పెన్షన్లపై అవగాహన

చుంచుపల్లి: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, పోస్టల్‌ అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, బిల్‌ కలెక్టర్లకు చేయూత పెన్షన్లపై శుక్రవారం ఐడీఓసీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భర్త/భార్య చనిపోతే భాగస్వామి పెన్షన్‌ పొందడం, పెన్షన్‌ డ్రా చేయని ఖాతాలు, చనిపోయిన వారి పేర్లను తొలగించటం, పంచాయతీ కార్యదర్శి ధ్రవీకరణ వంటి అంశాలపై సెర్ప్‌ డైరెక్టర్‌ గోపాలరావు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ ఎం విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డిప్యూటి సీఈఓ చంద్రశేఖర్‌, డీపీఓ చంద్రమౌళి, సెర్ప్‌ అదనపు డీఆర్‌డీఓ నీలేష్‌, సిబ్బంది కె.చంద్రశేఖర్‌, రవి, లోకేష్‌ పాల్గొన్నారు.

కేటీపీఎస్‌లో ఆర్టిజన్‌కు కరెంట్‌ షాక్‌

పాల్వంచ: కేటీపీఎస్‌ 7వ దశ కర్మాగారంలో ఓ ఆర్టిజన్‌ కార్మికుడు విద్యుదాఘతానికి గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌ పరిధిలో పనిచేసే ఆర్టిజన్‌ కార్మికుడు ఆర్‌.కాంతారావు కేటీపీఎస్‌ కర్మాగారంలో స్విచ్‌ యార్డ్‌ వద్ద 220 కేవీ లైన్‌ జంపర్లను కలిపేందుకు గురువారం రాత్రి వెళ్లాడు. ఈ క్రమంలో ఇండక్షన్‌ జరిగి కరెంట్‌ షాక్‌కు గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి కార్మికులు సీఆర్‌పీ చేసి కేటీపీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కొత్తగూడెం తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తోటి కార్మికులు తెలిపారు.

వైద్యం వికటించిందని

ఆందోళన

పాల్వంచ: వైద్యం వికటించిందని బాధితురాలు ప్రైవేట్‌ ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించింది. బాధితురాలి కథనం ప్రకారం.. వికలాంగులకాలనీకి చెందిన భూక్యా అరుణ శాసీ్త్రరోడ్‌ రెండోబజార్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లి నీరసంగా ఉందని చెప్పడంతో వైద్యుడు రెండు చేతులకు క్యాన్‌లా పెట్టారు. అనంతరం చేతులు రెండు వాచిపోయి గడ్డలు వచ్చాయి. దీంతో కొత్తగూడెం ఆస్పత్రికి వెళ్లగా వైద్యం వికటించిందని, ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. అందుకు రూ.లక్ష వరకు ఖర్చు అయింది. ఇంకా చికిత్స అందించాల్సి ఉందని తెలపడంతో ఇచ్చే స్తోమత లేదని వాపోయారు. అందుకు కారణమైన పాల్వంచ ఆస్పత్రికి అరుణ కుటుంబ సభ్యులు వచ్చి బైఠాయించి ఆందోళన తెలిపారు. దీంతో ఆస్పత్రి వైద్యులు పరారయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిందని, పరిశీలిస్తున్నామని తెలిపారు.

సజావుగా ఆరోగ్య కార్యక్రమాల అమలు1
1/2

సజావుగా ఆరోగ్య కార్యక్రమాల అమలు

సజావుగా ఆరోగ్య కార్యక్రమాల అమలు2
2/2

సజావుగా ఆరోగ్య కార్యక్రమాల అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement