
రామయ్య భూముల్లో అక్రమంగా నిర్మాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థాన భూముల ఆక్రమ కొనసాగుతోంది. పట్టణ సరిహద్దులోని ఏపీ పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న దేవస్థాన భూముల్లో కొందరు ఆక్రమణదారులు సోమవారం ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆలయ అధికారులు, సిబ్బంది వెళ్లి అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ మాట్లాడుతూ ఏపీ హైకోర్టు పురుషోత్తపట్నంలోని 889.50 ఎకరాల ఆలయ భూములను దేవస్థానానికి అప్పగించాలని న్యాయస్థానం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా రెవెన్యూ, పోలీసు అధికారులు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం దేవస్థాన భూములను ఆక్రమించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
కోకో పంటకు
ఉద్యాన శాఖ రాయితీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి కోకో పంటకు కూడా ఉద్యానశాఖ రాయితీ లభిస్తుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి జంగా కిషోర్ తెలి పారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ పంటకు సెమీ షేడ్ అవసరమైనందున ఆయిల్‌పామ్, కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చని సూచించారు. హెక్టార్‌కు 500 మొక్కలు అవసరమవుతాయ ని తెలిపారు. మొదటి సంవత్సరం హెక్టారుకు రూ.18 వేలు, రెండో సంవత్సరం రూ. 12 వేలు.. మొత్తం రూ.30 వేలు ఉద్యాన శాఖ ద్వారా మంజూరు చేస్తామని వివరించారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
అన్నపై తమ్ముడి హత్యాయత్నం
టేకులపల్లి: భూవివాదం కారణంగా అన్నపై తమ్ముడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి టేకులపల్లిలో చోటుచేసుకుంది. మండలంలోని మూడు తండాకు చెందిన గుగులోత్ రవి సోమవారం రాత్రి టేకులపల్లి జీపీ ఆఫీసు సెంటర్‌లోని బేకరీ వద్దకు వెళ్లా డు. ఆయన తమ్ముడు (బాబాయి కొడుకు) గుగులోత్ వినోద్‌కుమార్ కూడా రావడంతో ఇటీవల విక్రయించిన గుంటన్నర భూమి విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో వినోద్ కత్తితో రవిని బలంగా పొడవగా గాయాలయ్యాయి. ఆపై వినోద్ పారిపోగా, రవిని కొత్తగూడెంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విష యం తెలియడంతో ఎస్‌ఐ రాజేందర్, సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, అదే సమయంలో వినోద్ భార్య అటు వైపు రాగా స్థానికులు దేహశుద్ధి చేస్తుండడంతో ఎస్‌ఐ ఆమెను పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా వినోద్‌కుమార్ కత్తి తీసుకుని సెంటర్‌కు వెళ్లి తన స్నేహితులతో రవిని పిలిపించి హత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఇద్దరి మధ్య రూ.2.50లక్షల నగదు వివాదంతో దాడి జరిగిందని ఇంకొందరు చెబుతున్నారు.
అదుపుతప్పి లారీ బోల్తా
అశ్వారావుపేటరూరల్: ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన సోమవారం అశ్వారావుపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా హాలియా నుంచి కోల్‌కతాకు బత్తాయి కాయల లోడుతో వెళ్తున్న లారీ వ్యవసాయ కళాశాల వద్ద ఎదురుగా వచ్చే మరో వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. లారీ స్వల్పంగా ధ్వంసం కాగా, దాంట్లో ఉన్న బత్తాయి కాయలు దెబ్బతిన్నాయి.