
పర్ణశాలలో అభివృద్ధి పనులు
● ప్రసాద్ పథకంలో నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ● కొనసాగుతున్న కాటేజీ, బయో టాయిలెట్ల నిర్మాణం
దుమ్ముగూడెం: భద్రాచలం శ్రీ సీతారాముల దేవస్థానం అనుబంధ ఆలయం పర్ణశాలకు ప్రసాద్ పథకంతో మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చువల్ అగ్‌మెంటేషన్(ప్రసాద్) పథకం కింద పర్ణశాల రామాలయ అభివృద్ధికి నిధులు కేటాయించింది. దీంతో కాటేజీల నిర్మాణ పనులు చేపట్టగా ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం స్లాబ్ లెవల్ వరకు పూర్తయింది. నార చీరల ప్రాంతం వద్ద బయో టాయిలెట్లు నిర్మిస్తున్నారు. ఆలయంలో సీసీ కెమెరాలను ఏర్పా టు చేసి భద్రాచలం ప్రధాన ఆలయానికి అనుసంధానం చేశారు. పనులు పూర్తయితే పర్ణశాల ఆలయంతోపాటు గ్రామ రూపురేఖలు సైతం మారనున్నాయి.
రూ.4 కోట్లు కేటాయింపు
పర్ణశాల అభివృద్ధికి గతంలో కేటాయించిన నిధులతో నిర్మాణ పనులు జరుగుతుండగా భద్రాచలం ఆలయానికి కేటాయించిన నిధుల్లో మిగిలిన మరో రూ.4 కోట్లను పర్ణశాలకు మళ్లించారు. ఆ నిధులతో ఓపెన్ షెడ్ నిర్మాణం, ఆలయ ఆవరణలో గ్రానైట్ రాయితో ఫ్లోరింగ్ పనులు చేపట్టారు. భక్తులు వేచి ఉండేందుకు, భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే అన్నదానం కార్యక్రమానికి అనువుగా మరో రెండు షెడ్లను నిర్మించనున్నారు. గ్రామం చుట్టూ హైమా స్ట్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. శ్రీ సీతా రామలక్ష్మణులు 14 ఏళ్లపాటు పంచవటీ కుటీరం ఏర్పాటు చేసుకుని వనవాసం చేసిన పుణ్యస్థలం పర్ణశాలలో అభివృద్ధిపనులు సాగుతుడటంతో భక్తు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులన్నీ సజావుగా పూర్తయితే భక్తుల రద్దీ, ఆలయానికి ఆదాయం పెరిగే అవకాశంఉంది.
వ్యాపారం పెరుగుతుంది..
పర్ణశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయితే భక్తుల తాకిడి పెరుగుతుంది. దీంతో వ్యాపారాలు సైతం మంచిగా సాగుతాయి. భక్తులు రాత్రి పూట సేద తీరేలా ఉండేందుకు కూడా నిర్మాణాలు చేపట్టాలి.
–గోసంగి నరసింహారావు, పర్ణశాల గ్రామస్తుడు

పర్ణశాలలో అభివృద్ధి పనులు