
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల గ్రామపంచాయతీ హనుమంతులపాడు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికు ల కథనం ప్రకారం.. బొజ్జాయిగూడెం గ్రామపంచా యతీ కొల్లాపురం గ్రామానికి చెందిన ప్రణీత్‌కుమార్ (24), స్నేహితుడు కుంజ జలమయ్య బైక్‌పై కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో హనుమంతులపాడు గ్రామంలో ఆగి ఉన్న బోర్‌వెల్ వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రణీత్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, జలమయ్య చికిత్స పొందుతున్నాడు.
చండ్రుగొండలో ఒకరు..
చండ్రుగొండ: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. ఎస్‌ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం .. మండలంలోని తిప్పనపల్లి తండాకు చెందిన తేజావత్ రమేష్ అలియాస్ గోపి (35) ఆదివారం రాత్రి కిరాణషాపునకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో చండ్రుగొండ నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన గోపిని కొత్తగూడెం చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తమ్ముడు నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
ఇల్లెందురూరల్: అమ్మ డబ్బులివ్వలేదని క్షణికావేశానికి గురై ఓ యువకుడు పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొల్లాపురం గ్రామానికి చెందిన పూనెం వంశీ (23) అతిగా మద్యం తాగుతున్నాడు. సోమవారం డబ్బుల కోసం తల్లితో ఘర్షణ పడి క్షణికావేశంలో ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి కలుపు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి