తేలని పోడు పోరు.. | - | Sakshi
Sakshi News home page

తేలని పోడు పోరు..

Jul 18 2025 5:14 AM | Updated on Jul 18 2025 5:14 AM

తేలని పోడు పోరు..

తేలని పోడు పోరు..

● మాణిక్యారం – ఎర్రబోడు ప్లాంటేషన్‌ లో తరచూ వివాదం ● ప్రత్యామ్నాయం చూపలేదని పోడుదారుల ఆందోళన ● అక్కడే మకాం, వంటావార్పు ● తొలగించే క్రమాన ఘర్షణలు

కారేపల్లి: ప్రత్యామ్నాయం చూపిస్తామని పోడు భూమిని లాక్కున్నారని గిరిజనులు.. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటుచేసిన ప్లాంటేషన్‌లో సాగు చేయనిచ్చేది లేదని అటవీ అధికారులు.. ఇలా ఎవరికి వారు పట్టు వీడకపోవడంతో ఘర్షణలు నిత్యకృత్యమయ్యాయి. పోడు భూమి తప్ప తమకు ఆధారం లేనందున ప్రత్నామాయం చూపించాలని, లేకపోతే ఇక్కడే సాగు చేసుకోనివ్వాలని గిరిజనులు కోరు తూ తరచుగా దున్నేందుకు సిద్ధమవుతుండడం.. అధికారులు అడ్డుకునేక్రమాన గొడవలు జరుగుతున్నాయి. అయినా గిరిజనులు మాత్రం వెనక్కి తగ్గకుండా ప్లాంటేషన్‌లోనే డేరాలు వేసుకుని వంటా వార్పుతో అక్కడే గడుపుతుండడంతో వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ వివాదం...

కారేపల్లి మండలం మాణిక్యారం – ఎర్రబోడు గ్రామపంచాయతీల పరిధి మాణిక్యారం, గుడితండా, కోయగుంపు, రూప్లాతండా, ఎర్రబోడు గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాల గిరిజన, గిరిజనేతర పోడుదారులు ఏళ్లుగా పోడు చేసుకుంటున్నారు. వీరంతా కారేపల్లి ఫారెస్టు రేంజ్‌ పరిధి ఊట్కూరు నార్త్‌ బీట్‌లో సుమారు 150 ఎకరాల్లో తాతల నాటి నుంచి పోడు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. అయితే, సుమారు 50 హెక్టార్ల పోడు భూమి స్వాధీనానికి అటవీ అధికారులు కొన్నేళ్ల క్రితం సిద్ధమయ్యారు. ఇక్కడ అటవీ ప్లాంటేషన్‌ ఏర్పాటు చేస్తామని చెబుతూ... పోడుదారులకు ప్రత్యామ్నాయంగా మరో చోటు భూమి చూపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పోడుదారులు తొలుత నిరాకరించినా అధికారులు పట్టువదలకుండా పెద్దల సమక్షాన హామీ ఇవ్వడంతో 2020 సంవత్సరంలో ప్లాంటేషన్‌ ఏర్పాటు చేశారు.

హామీ మరిచిన అధికారులు

ఆపై అధికారులు ప్రత్యామ్నాయ భూమి చూపించకపోగా, ఎన్నిసార్లు పోడుదారులు కలిసినా స్పందనరాలేదు. ఈమేరకు 2021లో ప్లాంటేషన్‌లోని మొక్కలను పోడుదారులు ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఘర్షణ జరగగా 30మంది పోడుదారులపై కేసులు నమోదయ్యాయి. ఇందులో జాటోతు కిషన్‌, కాంపాటి రమేష్‌, భూక్యా రమేష్‌, రాయల మహేష్‌, కళమ్మ, వెంకన్న కోర్టుకు సైతం హాజరయ్యారు. ఇదే తరహాలో 2023, 2024లో కూడా పోడుదారులు ప్లాంటేషన్‌లోకి ప్రవేశించి మొక్కలు ధ్వంసం చేయడం, దున్నేందుకు యత్నించడం.. అధికారులు అడ్డుకుని కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. అయినా వివాదం సద్దుమణగలేదు. ఈసారి 7వ తేదీన పోడుదారులు అరకలు కట్టి దున్నుతుండగా.. అధికారులు అడ్డుకున్నారు. అక్కడ ఘర్షణ జరగడంతో ఎఫ్‌డీఓ వెంకన్న చేరుకుని త్వరలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

డేరాలు వేసుకుని మకాం

అధికారులు హామీ ఇచ్చి వారం దాటినా ఎలాంటి స్పందన లేకపోవడంపై పోడుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ప్లాంటేషన్‌ వద్దే డేరా లు వేసుకుని వంటావార్పు చేసుకుంటూ గడుపుతున్నారు. ఇక బుధవారం కూడా పోడుదారులు – ఉద్యోగుల నడుమ తారస్థాయిలో ఘర్షణ జరిగింది. సీపీఎంతో పాటు, అనుబంధ ప్రజాసంఘాలు పోడుదారులకు మద్దతు తెలుపుతూ పోడు పోరు తేల్చేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని చెబుతుండడం గమనార్హం.

పోడు ఘర్షణలో 16మందిపై కేసు

కారేపల్లి: మండలంలోని మాణిక్యారం, ఎర్రబోడు పోడు ప్లాంటేషన్‌లో పోడుదారులు, అటవీ ఉద్యోగులకు బుధవారం ఘర్షణ జరగగా, అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్లాంటేషన్‌లోకి అక్రమంగా ప్రవేశించి ధ్వంసం చేయడమే కాక తమ విధులకు ఆటంకం కలిగిస్తూ దాడి చేశారంటూ ఊట్కూరు ఎఫ్‌ఎస్‌ఓ శిల్ప ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోడుదారులు, సీపీఎం నాయకులు 16మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.గోపి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement