వర్షాభావంతో ఆందోళన | - | Sakshi
Sakshi News home page

వర్షాభావంతో ఆందోళన

Jul 18 2025 5:14 AM | Updated on Jul 18 2025 5:14 AM

వర్షా

వర్షాభావంతో ఆందోళన

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): లోటు వర్షపాతంతో పంటలు మాడిపోతున్నాయి. ఇప్పటికే పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. వరినార్లు ఎండిపోతున్నా యి. వర్షాభావ పరిస్థితులు వానాకాలం సాగుపై ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలో జూన్‌లో లోటు వర్షపాతం నమోదుకాగా రైతులు ఆందోళన చెందారు. ఈ నెల ప్రారంభంలో కురిసిన వర్షాలతో లోటు వర్షపాతం కాస్తా అధికవర్షపాతంగా నమోదైంది. రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. ఈ నెల 3వ తేదీ వరకు రైతులను మురిపించిన వర్షం.. ఆ తర్వాత అడపాదడపా చినుకులకే పరిమితమైంది. ఆశించినస్థాయిలో వానలు కురవకపోవంతో పత్తి పంటలు, వరినార్లు ఎండిపోతున్నాయి. రుతుపవనాలు ముందే వచ్చి మురిపించినా ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. జిల్లాలోని 12 మండలాల్లో లోటువర్షపాతం నమోదుకాగా, 9 మండలాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం రెండు మండలాలలో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. జూన్‌, జూలై నెలల్లో కురవాల్సిన వర్షం ముందే అంటే మే నెలలో కురవడం వల్ల సాగుపై తీవ్రప్రభావం చూపుతుందని స్వయంగా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించడం గమనార్హం. రాబోయే నాలుగైదు రోజులు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించగా రైతులు ఎదురు చూస్తున్నారు. పత్తి రైతులు మే నెలలో కురిసిన వర్షాలకు విత్తనాలు వేశారు. అనంతరం వరుణుడు మొఖం చాటేయడంతో మొలకెత్తలేదు. ఆ తర్వాత మళ్లీ విత్తారు. మొక్కలు మొలిచాక వర్షాలు లేకపోవడంతో వాడిపోతున్నాయి. దీంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. కాగా గురువారం రాత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం రైతులకు ఉపశమనం కలిగించింది. వడబడుతున్న పత్తి మొక్కలు, వరినారుకు ప్రాణం పోసినట్లయింది.

అత్యధికంగా జూలూరుపాడులో...

కరకగూడెం, పినపాక, దుమ్ముగూడెం, మణుగూ రు, ఆళ్లపల్లి, గుండాల, ఇల్లందు, చుంచుపల్లి, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, భద్రాచలం, ములకలపల్లి మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం నమోదైన మండలాల్లో చర్ల, అశ్వాపురం, టేకులపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్‌, పాల్వంచ, బూర్గంపాడు, దమ్మపేట ఉన్నాయి. జూలూరుపాడు, అశ్వారావుపేట మండలాల్లో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల్లో జూన్‌ 1వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు వర్షపాతం వివరాలను పరిశీలిస్తే.. జూలూరుపాడు మండలంలో అత్యధికంగా 40.9 మి.మీ వర్షపాతం నమోదుకాగా, చర్ల మండలంలో అత్యల్పంగా 1.4 మి.మీ వర్షపాతం నమోదైంది. కరకగూడెం మండలంలో 41.5 మి.మీ, పినపాక 48.4 , దుమ్ముగూడెం 38.7, అశ్వాపురం 7.3, మణుగూరు 39.2, ఆళ్లపల్లి, 27.7, గుండాల 23.5, ఇల్లెందు 36.1, టేకులపల్లి 9.6, చండ్రుగొండ 16.7, అన్నపురెడ్డిపల్లి 7.3, చుంచుపల్లి 30, సుజాతనగర్‌ 12.5, కొత్తగూడెం 26.8, లక్ష్మీదేవిపల్లి 28.2, పాల్వంచ 13.9, బూర్గంపాడు 1.5, భద్రాచలం 24.2, ములకలపల్లి 35.5, దమ్మపేట 17.1, అశ్వారావుపేటలో 37.7మి.మీ వర్షపాతం నమోదైంది.

వానల కోసం

రైతుల ఎదురుచూపులు

12 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు

తొమ్మిదింటిలో సాధారణం,

రెండింటిలో అధికం

గురువారం రాత్రి కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం

వర్షాలు పడితేనే మొక్కలకు జీవం

వర్షాభావ పరిస్థితులు భయపెడుతున్నాయి. మొదట వర్షాలు కురవడంతో సంతోషపడ్డాం. పత్తి విత్తనాలు వేశాం. తర్వాత వర్షాలు పడక అవి భూమిలోనే కలిసి పోయాయి. ఆ తర్వాత కురిసిన వర్షానికి మళ్లీ పత్తి విత్తనాలు వేశాం. అవి మొలకెత్తాయి. వర్షాలు పడితేనే మొక్కలు బతుకుతాయి.

– చింతల నాగరాజు, రైతు, గరిమెళ్లపాడు

వర్షాభావంతో ఆందోళన 1
1/2

వర్షాభావంతో ఆందోళన

వర్షాభావంతో ఆందోళన 2
2/2

వర్షాభావంతో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement