
‘మహిళా కోష్’తో వణుకు!
● 2006లో ఢిల్లీ ఎన్‌జీఓ నుంచి రూ. 7 కోట్ల రుణాలు.. ● ఉమ్మడి జిల్లాలో 14 మండలాల్లోని మహిళా సమాఖ్యలకు మంజూరు ● రుణాల రికవరీకి అక్కడి కోర్టు నుంచి తరచూ నోటీసుల జారీ ● తాజాగా మరోసారి నోటీసు రావడంతో మహిళా సమాఖ్యల ఆందోళన
చండ్రుగొండ: మహిళా సమాఖ్యల రుణాల రికవరీపై ఢిల్లీకి చెందిన ఎన్‌జీఓ రాష్ట్రీయ మహిళాకోష్ సీరియస్‌గా పావులు కదుపుతోంది. తాజాగా మండల సమాఖ్య బాధ్యులకు శుక్రవారం నోటీసలు రావడంతో ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో మహిళా సంఘాల్లో వణుకు పుడుతోంది. సెర్ప్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మహిళా సంఘాల సభ్యులు మనోవేదన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2006 ఏడాది రాష్ట్రీయ మహిళాకోష్ సంస్థ 14 మండలాల్లో మహిళా సమాఖ్యలకు రూ. 7 కోట్ల రుణాలను మంజూరు చేసింది. చండ్రుగొండ, కొత్తగూడెం, ములకలపల్లి, దమ్మపేట, సత్తుపల్లి, మధిర, వేంసూరు, బోనకల్, చింతకాని, గార్ల, కామేపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ, తిరుమలాయపాలెం మండలాల్లో ఒక్కో మండలానికి రూ. 50 లక్షల చొప్పున రుణాలను రెండు విడతలుగా ఇచ్చారు. అప్పట్లోనే సదరు నిధుల నుంచి ఒక్కో గ్రామ సమాఖ్యకు రూ. 1.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు రుణాలను పంపిణీ చేశారు. 2011 ఏడాది వరకు సక్రమంగానే వాయిదాలు చెల్లించారు. రుణాల నిధుల కేటాయింపు సమయంలో ఎన్‌జీఓ మండల సమాఖ్య అధ్యక్ష,కార్యదర్శులతోపాటు కోశాధికారిని ఢిల్లీ పిలిపించి వారినే బాధ్యులను చేస్తూ రుణ మొత్తాలను అప్పగించింది. 2011 ఏడాది తర్వాత మండల సమాఖ్యలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఉన్న మండల సమాఖ్య బాధ్యుల స్థానంలో కొత్తవారు ఎన్నికయ్యారు. దీంతోపాటు అప్పటి ఇందిరాక్రాంతి పథం అధికారులు, సిబ్బంది బదిలీపై వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రీయ మహిళాకోష్ రుణాలు వాయిదాల చెల్లింపులను ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఎన్‌జీఓ అక్కడి మెట్రోపాలిటిన్ కోర్టును ఆశ్రయించింది. 2014 ఏడాది కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు మండల సమాఖ్య మహిళల ఇళ్లకు వచ్చి నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచే కేసు సాగుతూ వచ్చింది. తాజాగా ఢిల్లీకి చెందిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మహిళా సంఘాలకు మరో మారు నోటీసులు జారీ చేశారు. దీంతో సమాఖ్య మహిళలు ఆందోళన చెందుతున్నారు.
భారీగా వడ్డీ భారం
మహిళా సమాఖ్యలు తీసుకున్న రాష్ట్రీయ మహిళాకోష్ రుణాల వడ్డీ ప్రస్తుతం తడిసి మోపైడెంది. చండ్రుగొండ మండలానికి అప్పట్లో 32 సంఘాలకు రూ. 50 లక్షలు రుణాలు ఇచ్చారు. అందులో 2011 ఏడాది వరకు రూ. 37 లక్షలు తిరిగి చెల్లించారు. అందులో రూ. 13 లక్షల వరకు అసలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం వడ్డీతో మొత్తం రూ. 60 లక్షలకు చేరుకుంది. ఇదే పరిస్థితి ఉమ్మడిజిల్లాలోని మిగిలిన 13 మండలాల్లో కూడా నెలకొంది.
రికవరీ నిధులు గోల్‌మాల్ చేశారా?
2011 ఏడాది తర్వాత రికవరీ ఎందుకు ఆగిపోయిందంటే.. ప్రస్తుతం ఉన్న అధికారుల నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. రికవరీ సొమ్మును అప్పటి అధికారులు, సిబ్బంది కాజేశారా ? లేదా గ్రామసమాఖ్యలే కట్టలేదా? అనే విషయం కూడా తేలని పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించిన ఎలాంటి రికార్డులు కూడా ప్రస్తుతం సెర్ప్ అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం.