కరకగూడెం: అభివృద్ధికి ఆటంకం మావోయిస్టులేనని జిల్లా అడిషనల్ ఎస్పీ నరేందర్ పేర్కొన్నారు. మండలంలోని రేగళ్ల గొత్తికోయ గ్రామంలో సోమవారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావో యిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ లకు పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మా వోయిస్టులకు సహకరించొద్దని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. అనంతరం చిన్న పిల్లలకు పలకలు, పుస్తకాలు, మహిళలకు నిత్యావసర వస్తువులు, యువతకు వాలీబాల్ కిట్లు అందజేశారు. పొలం పనులకు వెళ్లే మహిళలకు ప్లాస్టిక్ రైన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పీవీఎన్.రావు పాల్గొన్నారు.