
అనుమతి లేకుండా వెళ్లిపోయిన టీచర్
పాఠశాలలో బిక్కు బిక్కుమంటూ
గడిపిన విద్యార్థులు
టేకులపల్లి: మండలంలోని బద్దూతండా పంచాయతీ మద్దిరాలతండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సోమవారం మధ్యాహ్నం తర్వాత అనుమతి లేకుండానే విధుల నుంచి వెళ్లిపోయాడు. సెలవు చీటి పిల్లలకు ఇచ్చి ఎవరైనా వస్తే చూపించండని చెప్పాడు. కాగా, పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ సాయంత్రం వరకు గడిపారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు కాంప్లెక్స్ హెచ్‌ఎం నుంచి అనుమతి తీసుకుని వెళ్లాల్సి ఉంది. కానీ అనుమతి తీసుకోకుండానే, కనీస బాధ్యతను మరిచి పిల్లలను వదిలేసి వెళ్లిపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కాంప్లెక్స్ హెచ్‌ఎం జోగ రవిని వివరణ కోరగా... అనుమతి కోసం తనను సంప్రదించలేదని తెలిపారు.
బకాయిలు విడుదల చేయాలి
ఖమ్మం మామిళ్లగూడెం: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈసందర్భంగా పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.వెంకటేష్, బెస్ట్ అవైలబుల్ పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యుడు గురుస్వామి రాష్ట్రవ్యాప్తంగా రూ.200కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఫలితంగా పాఠశాలల యజమాన్యాలు పిల్లలను ఇబ్బంది పెడుతున్న నేపథ్యాన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.