బయోచార్‌తో భూసారం.. | - | Sakshi
Sakshi News home page

బయోచార్‌తో భూసారం..

Jun 21 2025 3:09 AM | Updated on Jun 21 2025 3:59 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): వ్యవసాయాన్ని సహజంగా మార్చుకునే క్రమంలో బయోచార్‌ వినియోగం ఇటీవల అందుబాటులోకి వచ్చింది. పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీనిని తయారు చేసుకుని సాగు భూముల్లో వేసుకోవచ్చు. జిల్లాలో మొదటి సారిగా గత నెలలో కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ క్యాంపు కార్యాలయంలో బయోచార్‌ తయారీకి శ్రీకారం చుట్టారు.

ఇవీ ఉపయోగాలు

బయోచార్‌ అనేది ఎరువు కాదు. కానీ పంటలకు వేసే ఎరువుల వినియోగ సామర్థ్యం 30–40 శాతం పెంచుతుంది. మట్టిలో పేరుకుపోయిన రసాయన అవశేషాలను తొలగించేందుకు తోడ్పడుతుంది. సాగునీటిలో విషాలను హరించివేస్తుంది. దీన్ని బయో (జీవం), చార్‌ (చార్‌కోల్‌ బొగ్గు) జీవం ఉన్న బొగ్గుగా పేర్కొనవచ్చు. నేలసారానికి సేంద్రియ కర్బనం అవసరం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు. దీన్ని పెంపొందించేందుకు బయోచార్‌ ఉపయోగపడుతుంది. తద్వారా అధిక దిగుబడులు, నాణ్యమైన పంట ఉత్పత్తులను సాధించవచ్చు.

తయారీ ఇలా..

పత్తి కట్టె, మిరపకట్టె, మొక్కజొన్న చొప్ప, వేరుశెనగ పొట్టు, వరి పొట్టు, పొగాకు మోడ్లు తదితర వ్యర్థ పదార్థాలను తగులబెట్టే బదులు వీటితో బయోచార్‌ తయారు చేయవచ్చు. తుమ్మవంటి కంప చెట్ల కలపతో, జీడి గింజల పైపెంకులతో కూడా బయోచార్‌ తయారు చేయవచ్చు. పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో పెద్దగా పొగ రాకుండా 450 డిగ్రీల నుంచి 750 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో కాల్చితే (ఈ ప్రక్రియను పైరోలైసిస్‌ అంటారు) తయారయ్యే నల్లని కట్టె బొగ్గే బయోచార్‌. రైతులు ఇనుప డ్రమ్ముల్లో లేదా కందకం తవ్వి కూడా బయోచార్‌ను తయారు చేయవచ్చు.

నేరుగా వేయకూడదు..

బయోచార్‌ను నేరుగా పొలాల్లో వేయకూడదు. బయోచార్‌ కంపోస్టును తయారు చేసుకుని వేయాలి. మాగిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు లేదా జీవామృతం లేదా పంచగవ్వ వంటి ఏదైనా సేంద్రియ ఘన/ద్రవ ఎరువుల్లో ఏదో ఒకదానిని బయోచార్‌తో సమపాళ్లలో కలపాలి. కుప్పగా వేసి బెల్లం నీటిని చిలకరిస్తూ రోజు కలియ తిప్పుతూ ఉంటే 15 రోజుల్లో బయోచార్‌ కంపోస్టు తయారవుతుంది. సాగు భూముల్లో మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవాలి.

తొలుత కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో..

జిల్లాలోని ప్రతీ గ్రామంలో కనీసం ఒక రైతైనా బయోచార్‌ తయారుచేసి పంటసాగులో వాడేలా చూడాలని కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ ఇప్పటికే వ్యవసాయాధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మొదట బయోచార్‌ తయారు చేయగా, ప్రస్తుతం వ్యవసాయాధికారులు వివిధ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా బయోచార్‌ తయారీ చేపడుతున్నారు.

కలెక్టరేట్‌లో తొలిసారిగా ప్రయోగాత్మక ప్రదర్శన

గ్రామానికో రైతు బయోచార్‌ వినియోగించేలా చర్యలు

సేంద్రియ కర్బనం పెంపొంది అధిక, నాణ్యమైన పంట ఉత్పత్తులు

బయోచార్‌తో భూసారం..1
1/1

బయోచార్‌తో భూసారం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement