రామయ్యకు వైభవంగా వసంతోత్సవం | Sakshi
Sakshi News home page

రామయ్యకు వైభవంగా వసంతోత్సవం

Published Tue, Apr 23 2024 8:40 AM

వసంతోత్సవంలో సీతారామచంద్రస్వామి  - Sakshi

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగియనున్నాయి. శ్రీరామనవమి అనంతరం నూతన వధూవరులైన సీతారాములకు వసంతోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో సోమవారం ఈ వేడుకను వైభవంగా జరిపించారు. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారి ఉత్సవ మూర్తులను అంతరాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన బేడా మండపంలోని నిత్యకల్యాణ వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర పూజలు చేసిన అర్చకులు.. పసుపులోకి లక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. తొలుత మూలమూర్తులకు, అనంతరం లక్ష్మీ అమ్మవారికి, ఆండాళు అమ్మవారికి, ఆంజనేయస్వామి వార్లకు, చివరగా ఉత్సవమూర్తులకు వసంతం చల్లారు. నూతన వధువరులైన సీతా, రామయ్యను ఎదురెదురుగా ఉంచి జరిపిన ఈ క్రతువు భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వసంతోత్సవ విశిష్టతను వేద పండితులు వివరించారు. భక్తులపై స్వామివారి వసంతాన్ని చల్లి ఆశీర్వదించారు. కాగా, చివరి రోజైన మంగళవారం చక్రతీర్థం, సాయంత్రం పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. బుధవారం నుంచి స్వామివారి నిత్యకల్యాణాలు పునఃప్రారంభం కానున్నాయి.

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

Advertisement
 
Advertisement
 
Advertisement