లోకల్ బియ్యానికి రంగుల సోకులు వినియోగదారులను అధిక ధరలతో దోచుకుంటున్న వ్యాపారులు
అంతా ఇష్టారాజ్యం
చీరాల టౌన్: బియ్యం వ్యాపారులు రకరకాల బ్రాండ్‌ల పేరుతో జేబులు నింపుకొంటున్నారు. పైకి బీపీటీఎల్ మొదటి రకం, రెండో రకం అంటూ చెప్పి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. కేవలం సంచులు మార్చి ఒకే బియ్యాన్ని అందరికీ అంటగడుతున్నారు. లాభసాటిగా మారడంతో జిల్లాలో దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని వారి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. రేషన్ బియ్యం కూడా పట్టపగలే రూట్ మారుతున్నాయి. పాలిష్ పెట్టించి ఆకర్షణీయమైన రంగుల సంచుల్లో నింపి ప్రజలకు అంటగడుతున్నారు. పలు బ్రాండ్ల పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. తనిఖీల పేరుతో అక్కడకు వెళ్లినా బియ్యం స్టాకు రిపోర్టులు మాత్రమే చూస్తున్నారు. జిల్లాలో వందకు పైగా రైస్ మిల్లులు ఉండగా చీరాల ప్రాంతంలో 15 వరకు ఉన్నాయి.
ఇతర జిల్లాల నుంచి దిగుమతి
ధాన్యాన్ని ఎక్కువగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి చీరాల ప్రాంతానికి దిగుమతి చేసుకుంటున్నారు. ధాన్యాన్ని పాలిష్ పెట్టించి వాటిని రంగు సంచుల్లో 26 కేజీలు చొప్పున బయటి మార్కెట్‌కు పంపుతున్నారు. బ్రాండ్‌ల పేరుతో రిజిస్టర్ చేసుకున్నవి అరకొరగానే ఉన్నాయి. బియ్యాన్ని బయట మార్కెట్‌లో ప్రజలను ఆకర్షించేందుకు గాను అందమైన రంగు సంచుల్లో, పలు బ్రాండ్ల పేరుతో విడుదల చేస్తున్నారు. వీటిని ఎక్కువగా చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రైస్ కాన్వాసింగ్ ఏజెంట్లు కూడా చీరాల్లో ఎక్కువగా ఉన్నారు. పలు మిల్లుల నుంచి బియ్యం రకాలను తీసుకెళ్లి అక్కడ రిటైల్, హోల్‌సేల్ షాపులకు విక్రయిస్తున్నారు. ఆర్డర్లపై క్వింటాళ్లలో పంపుతున్నారు. ఆదాయం కూడా ఎక్కువగా రావడంతో పలువురు వ్యాపారులు, మిల్లర్లు కలిసి ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు. అక్రమార్కులకు పచ్చపార్టీ నేతల మద్దతు, సహకారం ఉండటంతో బియ్యం ధరలు అడ్డగోలుగా పెంచి నాసిరకం అంటగడుతున్నారు.
రైస్‌మిల్లర్లు కూడా పలు రకాల పేర్లుతో లోకల్ బియ్యానికి కొత్త రంగు అద్ది వ్యాపారం సాగిస్తున్నారు. ఇష్టమొచ్చిన ధరకు అమ్మకాలు చేస్తున్నారు. బీపీటీఎల్ క్వింటా హోల్‌సేల్ రూ.6,500 నుంచి రూ.7 వేల వరకు ఉంది. రంగుల సంచుల్లో అమ్మే 26 కిలోల బియ్యం మాత్రం రూ.1,900లపైనే రిటైల్‌గా అమ్ముతున్నారు. రంగుల సంచులకు సొంత పేర్లు పెట్టుకుని ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తున్నారు. జిల్లాలో సుమారుగా వెయ్యికి పైగా బియ్యం షాపులున్నాయి. చీరాల్లో పేరుగాంచిన రైస్ మిల్లుల్లో ఈ వ్యాపారం రూ.కోట్లలో సాగుతోంది. బ్రాండ్‌లకు రిజిస్ట్రేషన్ లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.


