శాస్త్రోక్తంగా అమరేశ్వరుడికి సహస్ర ఘటాభిషేకం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా అమరేశ్వరుడికి సహస్ర ఘటాభిషేకం

Oct 7 2026 2:16 AM | Updated on Oct 7 2026 2:16 AM

శాస్త్రోక్తంగా అమరేశ్వరుడికి సహస్ర ఘటాభిషేకం కామన్‌వెల్త్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పతక గ్రహీతకు సత్కారం శిశువుల విక్రయం కేసులో ఇరువురు అరెస్ట్‌

అమరావతి: అమరావతిలో అమరేశ్వరుడికి మంగళవారం శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు సంకల్పం మహాన్యాసం, ఋష్య శృంగ ఆవాహన, వరుణ జపం, సూర్య నమస్కారాలు నిర్వహించారు. తొలుత ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో మహాన్యాసం నిర్వహించిన అనంతరం అర్చకులు, గ్రామంలోని బ్రాహ్మణులు, వేదపండితులు పవిత్ర కృష్ణానది నుంచి ఘటాలతో అభిషేక జలాలను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకించారు. అనంతరం అమరేశ్వరునికి ప్రత్యేక అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు.

త్రికోటేశ్వరస్వామికి...

నరసరావుపేట: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం ఘనంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షభావ పరిస్థితుల నుంచి బయట పడేందుకు అవసరమయ్యే వర్షాలు కురవాలని, సమృద్ధిగా పంటలు పండి తద్వారా ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలన్న ఆకాంక్షతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు దేవస్థానం సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి డి.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, అర్చకులు సహస్ర ఘటాభిషేకంలో స్వామివారికి గణపతి పూజ, వరుణ జప సంకల్పం, నవగ్రహ మండపారాధన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

తెనాలి: ఇటీవల జరిగిన కామన్‌వెల్త్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో పతకంతోపాటు అంతర్జాతీయ పోటీల్లో నాలుగు మెడల్స్‌ సాధించిన తెనాలికి చెందిన మధిర షానూన్‌ను మంగళవారం పలువురు అభినందించారు. పట్టణ చెంచుపేటలోని మార్గ్‌ అపార్టుమెంట్‌లోని ఆమె నివాసానికి వెళ్లి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు, మార్తా గ్రూప్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అధినేత యనమల ఈశ్వర్‌ బృందం సత్కరించింది. భవిష్యత్‌లో దేశం తరఫున మరిన్ని పతకాలు అందుకోవాలని ఆకాంక్షించారు. 2023 నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయంగా నాలుగుసార్లు మెడల్స్‌, జాతీయస్థాయిలో ఐదుసార్లు, రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో 15కు పైగా పతకాలు అందుకున్నట్లు షానూన్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎన్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ పల్లె శామ్యూల్‌, ప్రభాకర్‌, ఫ్రెండ్స్‌ ఫరెవర్‌ చైర్మన్‌ సముద్రాల రాజేష్‌, అగాపేలవ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ పల్లికొండ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సత్తెనపల్లి: మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఇరువురు శిశువుల విక్రయం కేసులో పల్నాడు జిల్లా సత్తెనపల్లి, ముప్పాళ్లకు చెందిన ఇరువురిని ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ముంబయిలో ఏడాది కిందట ఇరువురు శిశువులు అపహరణకు గురయ్యారు. ఆ కేసులో 15 మంది నిందితులు ఉన్నారు. కాఆ, ఇటీవల విజయవాడకు చెందిన సరోజినీ అనే మహిళను ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ వ్యవహారంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన బాబావలి, ముప్పాళ్లకు చెందిన శ్రీనివాసరావులతో కలిసి ఇరువురు శిశువులను విక్రయించినట్లు విచారణలో ఆమె వెల్లడించినట్లు తెలిసింది. దీంతో బాబావలి, శ్రీనివాసరావులను ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సత్తెనపల్లి మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ప్రియదర్శిని ఎదుట హాజరు పరిచారు. తర్వాత విచారణ నిమిత్తం వారి వెంట తీసుకెళ్లారు. కాగా ఆ ఇద్దరు నిందితులపై పలు కేసులు ఉన్నట్లు ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల దర్యాప్తులో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement