గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈనెల 26, 27, 28 తేదీల్లో మూడవ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవం నిర్వహిస్తున్నట్లు గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో ‘నారా చంద్రబాబు నాటకోత్సవం–2026’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు నాటక రంగానికి గుంటూరు జిల్లా ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ప్రాంతమని, నాటకం కేవలం వినోద సాధనమే కాకుండా సమాజాన్ని ఆలోచింపజేసే శక్తివంతమైన సాంస్కృతిక మాధ్యమమని అన్నారు. విలువలు, సామాజిక బాధ్యతలు, మానవీయ సంబంధాలను నాటకాల ద్వారా చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి నాటక సమాజాలను ఆహ్వానించి ఒకే వేదికపై ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా కళాకారుల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని చెప్పారు. కొత్త కళాకారులకు అవకాశాలు కల్పించడంతోపాటు తెలుగు నాటక రంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు. భారతీయ విద్యా భవన్ కార్యదర్శి, నాటకోత్సవ సహ నిర్వాహకుడు పి.రామచంద్రరాజు మాట్లాడుతూ కళలు, సాహిత్యం, నాటక రంగాలను ప్రోత్సహించడంలో ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. నాటకోత్సవ నిర్వాహకుడు అభినయ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు నాటక రంగంలో కొత్త ఆలోచనలు, కొత్త రచనలు, కొత్త నటీనటులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన నాటక సమాజాలను ఆహ్వానించి, విభిన్న సామాజిక అంశాలతో రూపొందిన నాటికలను ప్రేక్షకులకు అందిస్తున్నామని, అన్నీ కొత్త నాటికలేనని చెప్పారు. నాటక ప్రదర్శనలకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. మూడు రోజుల పాటు ఆరు నాటికల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.


