డిప్యూటీ సీఎం కె.పవన్ కళ్యాణ్
బాపట్లటౌన్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కళ్యాణ్ తెలిపారు. మండలంలోని సూర్యలంక సమీపంలో ఏర్పాటు చేసిన నగర వనాన్ని మంగళవారం వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రారంభించారు. తొలుత ఎన్‌సీసీ విద్యార్థులు, ఫారెస్ట్ అధికారులతో కలిసి నగరవనంలో మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడాలన్నారు. గుంటూరు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సూర్యలంక తీరానికి వచ్చే పర్యాటకులు సేద తీరేందుకు వసతులు నగరవనంలో ఉన్నాయన్నారు. పాదచారుల కోసం పచ్చని చెట్ల మధ్యలో మంచి వాకింగ్ ట్రాక్ కూడా అందుబాటులో ఉందన్నారు. జిమ్ పరికరాలు, చిల్డ్రన్స్ పార్క్ కూడా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ సంరక్షణ అధికారి జాస్తి పుష్ప సౌజన్య, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.లవన్న, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మన్యం సురేంద్రబాబు, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వో వి.బాలకృష్ణ, వన సంరక్షణ సమితి చైర్‌పర్సన్ మేక శ్రీనివాసరావు, మానవత సంస్థ ప్రతినిధులు గురజాల శ్రీనివాసరావు, వంకాయలపాటి హరిబాబు, గొల్ల ఏకాక్షరి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కోటా వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


