గత ఎన్నికల్లో ఘర్షణ జరిగిన ప్రాంతాలు గుర్తించాలి ఫ్యాక్షన్ గ్రామాల్లో నమోదైన కేసుల పురోగతిని పరిశీలించండి గుంటూరు రేంజ్ ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలతో సమీక్షలో డీజీపీ
నగరంపాలెం(గుంటూరువెస్ట్): స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేసుకోవాలని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సూచించారు. సాధారణ పురపాలక ఎన్నికల నిర్వహణకు సంబంధించి సన్నాహక చర్యల్లో భాగంగా మంగళవారం గుంటూరు పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో సమావేశం నిర్వహించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలకు సంబంధించి వివరాలపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో ప్రకటించనున్నారని తెలిపారు. అంతకుముందే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గత ఎన్నికల్లో ఘర్షణలు, వివాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించాలని అన్నారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలను సైతం ముందుగానే గుర్తించాలని చెప్పారు. రౌడీషీటర్లు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. బైండోవర్‌ను రూ.10 లక్షలకు చేయించాలని అన్నారు. నాటుసారా, అక్రమ మద్యం, నగదు పంపిణీ, ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులు నెలకొల్పి, తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో 2021, 2024లో నమోదైన కేసుల పురోగతిని పరిశీలించి, వాటిపై చర్యలు చేపట్టాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలను సాధారణ, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్‌గా వర్గీకరించి అనుగుణంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. లైసెన్స్‌డ్ ఆయుధాలను నిబంధనల ప్రకారం డిపాజిట్ చేయించే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అనుమతుల్లేని సభలు, ర్యాలీలు, సమావేశాలపై నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని చెప్పారు.
అసత్య ప్రచారంపై నిఘా ఉంచాలి
అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి ఎన్నికలపై సూచనలు, సలహాలిచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాట్లాడుతూ స్టేషన్ల పరిధిలో గొడవలు జరిగే ప్రాంతాలు గుర్తించాలని అన్నారు. గ్రామాల్లో కార్డన్ సెర్చ్ చేసి, అక్రమ ఆయుధాలను గుర్తించాలని చెప్పారు. ఎన్నికల వేళ అసత్య ప్రచారంపై ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్, పల్నాడు, ప్రకాశం జిల్లా, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, మార్కాపురం జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.


