చిరు వేతనజీవులకు శిక్ష | - | Sakshi
Sakshi News home page

చిరు వేతనజీవులకు శిక్ష

Aug 4 2026 1:29 AM | Updated on Aug 4 2026 1:29 AM

చిరు వేతనజీవులకు శిక్ష ‘సమగ్ర శిక్ష’ ఉద్యోగుల ఆకలి కేకలు జీతాలు అందని వారు వీరే..

జీతం తీసుకుని రెండు నెలలు.. రాష్ట్రంలో 23 వేల మంది సిబ్బంది వారి కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక

‘సమగ్ర శిక్ష’ ఉద్యోగుల ఆకలి కేకలు
జీతాలు అందని వారు వీరే..

వేటపాలెం: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థను ముందుకు నడిపిస్తున్న సుమారు 23 వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు గత రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగుల కుటుంబాలు నిత్యావసర ఖర్చులకు కూడా డబ్బులు లేని దుస్థితికి చేరుకున్నాయి. జీతాల కోసం ఎదురుచూస్తూ ఈఎంఐలు, అప్పులు, వడ్డీలు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య జీవనం సాగిస్తున్నట్లు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రగల్భాలే.. పనులు శూన్యం

అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రతి నెలా మొదటి తేదీకే ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లిస్తున్నామని ప్రకటించినప్పటికీ.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలకు వెన్నెముకగా నిలిచే తమకు వరుసగా రెండు నెలలుగా జీతాలు అందకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు.

సంక్షేమ పథకాలకూ నోచుకోని వైనం

సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో చాలా మంది వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలో కూడా లేకపోవడంతో జీతమే వారి కుటుంబాలకు ఏకై క జీవనాధారంగా మారింది. రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబాలన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగులు తమ విధులను విస్మరించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలు, కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల నిర్వహణ, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సేవలు, విద్యా సర్వేలు, డేటా నిర్వహణ, శిక్షణ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆదేశాల అమలు వంటి బాధ్యతలను యథావిధిగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

సమస్యకు పరిష్కారం ఏదీ?

ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన పరిష్కారం లభించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యలను కేవలం పరిపాలనా అంశంగా కాకుండా 23 వేల కుటుంబాల జీవనాధారానికి సంబంధించిన అత్యవసర మానవతా సమస్యగా పరిగణించి వెంటనే పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలు విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

వేతనాలు కోసం ఎదురుచూస్తున్న వారిలో కేజీబీవీ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, క్లస్టర్‌ రిసోర్స్‌ మొబైల్‌ టీచర్లు, ఎంఐఎస్‌ కో–ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్లు, అకౌంట్స్‌ సిబ్బంది, సైట్‌ ఇంజినీర్లు, ఫిజయోథెరపిస్టులు, మెసెంజర్లు, పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లు తదితర విభాగాల ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ విద్యా కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వేతనాల విషయంలో ప్రభుత్వం నుంచి తీవ్ర నిర్లక్ష్యం ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. జీతంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు ప్రస్తుతం ఇంటి అద్దెలు, బ్యాంకు రుణాల ఈఎంఐలు, పిల్లల స్కూల్‌, కాలేజీ ఫీజులు, వృద్ధుల వైద్య ఖర్చులు, గర్భిణుల చికిత్సలు, చిన్నారుల అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉన్నామని వాపోతున్నారు. కొందరు బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు చేయగా, మరికొందరు ఇంటి వస్తువులను తాకట్టు పెట్టి కుటుంబాలను పోషిస్తున్నట్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement