రియల్‌గానే మోసం | - | Sakshi
Sakshi News home page

రియల్‌గానే మోసం

Aug 3 2026 1:25 AM | Updated on Aug 3 2026 1:25 AM

రియల్‌గానే మోసం

చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు ధనార్జనే ధ్యేయంగా బరితెగిస్తున్నారు. రామాపురంలోని సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ చుట్టుపక్కల భూములపై కన్నేసిన కొందరు నేతలు ఒక వ్యూహంతో డంపింగ్‌ యార్డులా మార్చిన తర్వాత పరిసర భూములను భారీ మొత్తాలకు కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతోంది. డంపింగ్‌ యార్డును అక్కడి నుంచి తరలిస్తున్నారని చెబుతూ ఆ భూములను ఎక్కువ ధరకు విక్రయించారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇంకొంత భూమిని కొనుగోలు చేసే పనిలో ఉన్నారని తెలిసింది. చుట్టుపక్కల వివాదాస్పద భూములు ఉండటంతో వివరాలు తెలియక కొనుగోలు చేసిన వారు నష్టపోయే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

చీరాల: చీరాలలో ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం రాజకీయాలతో ముడిపడి సాగుతోందనే చర్చ నడుస్తోంది. భూముల విలువ రూ. లక్షల నుంచి రూ. కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ‘‘పైసలిచ్చే వారికి పెద్దపీట’’ అనే ధోరణితో కొందరు కీలక టీడీపీ నేతలు కొందరు వ్యాపారులు, పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీనికి వేటపాలెం మండలం రామాపురంలోని సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ వేదికగా మారిందని స్థానికంగా చర్చ మొదలైంది. గతంలో ఇక్కడి సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ సమర్థంగా పనిచేసి మంచి ఫలితాలు ఇచ్చింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్‌ పాలకులు, అధికారులు యూనిట్‌ నిర్వహణను నిర్లక్ష్యం చేశారని విమర్శలు ఉన్నాయి. ఫలితంగా అది డంపింగ్‌ యార్డుగా రూపొంది దుర్గంధానికి కేంద్రంగా మారిందని చెబుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని చుట్టుపక్కల భూముల యజమానులకు మార్కెట్‌ ధర కంటే 10 శాతం ఎక్కువ ఇస్తామని కొందరు కీలక టీడీపీ నేతలు ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత భూములను ఎంతకు విక్రయించినా అది తమ ఇష్టమనే కోణంలో చర్చలు జరిపినట్లు ప్రచారం ఉంది. ఈ క్రమంలో సుమారు 30 ఎకరాలకు అడ్వాన్స్‌లు ఇచ్చారని, అనంతరం సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను అక్కడి నుంచి తరలిస్తారనే ప్రచారం చేసి, ఆ భూములను సుమారు రూ.30 కోట్ల లాభంతో ఇతరులకు విక్రయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రంగంలోకి ప్రతిపక్షం

ఇప్పటికే అనధికార లేఅవుట్ల కారణంగా పలువురు కొనుగోలుదారులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. రామాపురం తదితర ప్రాంతాల్లో జరిగిన భూ లావాదేవీల్లో వివాదాలు తలెత్తగా, కొన్ని ప్రైవేట్‌ పంచాయితీల వరకు వెళ్లినట్లు సమాచారం యూనిట్‌ తరలింపు సాధ్యం కాదనే సమాచారం వెలుగులోకి రావడంతో, భూములు కొనుగోలు చేసిన వారు నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు ఇటీవల కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రూ. 5.80 కోట్ల వ్యయంతో నిర్మించిన సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను 2017 మార్చిలో ప్రారంభించారు. అప్పటి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ప్రస్తుతం కూడా అదే శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. చర్యలు తీసుకోవాలని విపక్షాలతోపాటు కూటమి వర్గాలూ కోరాయి.

యంత్రాలకు తుప్పు...

యూనిట్‌లో చెత్త శుద్ధి కోసం కొనుగోలు చేసిన యంత్రాలు తుప్పుపట్టాయి. షెడ్లు నిరుపయోగంగా మారాయి. ప్రాంగణంలో చెత్త కొండలను తలపించేలా పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో యూనిట్‌ను ముందుగానే డంపింగ్‌ యార్డుగా మార్చి, ఎలాంటి నిర్వహణ లేకుండా వదిలేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చుట్టుపక్కల భూములపై ఆసక్తి తగ్గిందనే భావన కల్పించి, తక్కువ ధరలకు కొనుగోలు చేసి, అనంతరం అధిక ధరలకు విక్రయించి రూ.కోట్లు ఆర్జించే ప్రయత్నాలు జరిగాయని ప్రచారం ఉంది. గతంలో 30 ఎకరాలు ఈ విధంగా చేతులు మారగా, ప్రస్తుతం మరో 40 ఎకరాలను విక్రయించే యత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికంగా వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement