అభయ ప్రదాయినిగా బగళాముఖి | - | Sakshi
Sakshi News home page

అభయ ప్రదాయినిగా బగళాముఖి

Aug 3 2026 1:19 AM | Updated on Aug 3 2026 1:19 AM

అభయ ప్రదాయినిగా బగళాముఖి పెద్దింటమ్మకి ఆషాఢ బోనాలు నేడు కోటప్పకొండలో సహస్ర ఘటాభిషేకం న్యాయవాదులకు షటిల్‌ పోటీలు

చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బగళా ముఖి అమ్మవారు ఆదివారం అభయప్రదాయిని అలంకరణలో పూజలు అందుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా చందోలు, కుంచలవారిపాలేనికి చెందిన భక్తులు పొంగళ్లు చేసుకుని మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారికి సారె, ఇతర నైవేద్యాలు సమర్పించారు.

అమరావతి: అమరావతి గ్రామ దేవత పెద్దింటమ్మకు ఆషాఢ మాసం బోనాలను ఆదివారం సమర్పించారు. ఆదివారం ఉదయాన్నే అమ్మవారికి పంచామృత అభిషేకం, అనంతరం వివిధ రకాల కూరగాయలతో శాకంబరీదేవి అలంకారం చే శారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గ్రామంలోని భక్తులు పొంగళ్లు చేసుకుని మేళాతాళాలతో ఊరేగింపుగా పెద్దింటమ్మ గుడికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ఆషాఢ మాస బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు నిర్వాహకులు తీర్థ్ధప్రసాదాలు అందజేశారు.

నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని కోరారు.

గుంటూరు లీగల్‌: బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఏపీ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులోని ఆఫీసర్‌ క్లబ్‌లో జరిగిన పురుష న్యాయవాదుల షటిల్‌ డబుల్స్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. విన్నర్‌గా జె.మాధవరావు–సుదర్శన్‌, రన్నర్‌గా బి.ప్రభాకర్‌ వర్మ–జి.శ్రీనివాస్‌ జోడీ నిలిచారు. గుంటూరు బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మధిర నాగేశ్వరరావు డ్రా తీసి పోటీలు తొలుత ప్రారంభించారు. స్పోర్ట్స్‌, కల్చరల్‌ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు పర్యవేక్షించారు. రాయపూడి శ్రీను, షేక్‌ సుభాని, పాలపర్తి అనిల్‌, మైలా జాన్‌ జాబేజ్‌, బండ్ల కృష్ణ, కొప్పుల కిరణ్‌, సతీష్‌ సహకారం అందించారు.

దుర్గమ్మకు కానుకగా బంగారు వస్తువులు

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయనగరానికి చెందిన భక్తులు ఆదివారం బంగారపు నత్తు, బొట్టు, బొల్లాకిని కానుకగా సమర్పించారు. విజయనగరం జిల్లా గాజుల రేగకు చెందిన కె. సత్యనారాయణ, అప్పాయమ్మ దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేశారు. రూ. 2.50 లక్షల వ్యయంతో సుమారు 19 గ్రాముల బంగారాన్ని వినియోగించి బొట్టు, నత్తు, బొల్లాకిని తయారు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకులు నాగేశ్వరరావు తదితరులు అమ్మవారి చిత్రపటం,ప్రసాదాలు, శేష వస్త్రాలను బహూకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement