భక్త బృందాలతో కిక్కిరిసిన ఇంద్రగిరి
రికార్డు స్థాయిలో సారె సమర్పణలు
ఉక్కపోతతో భక్తుల ఇబ్బందులు
పలువురికి క్యూలైన్‌లోనే అస్వస్థత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు, భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. ఆలయానికి చేరుకునే కుమ్మరిపాలెం, బ్రాహ్మణ వీధి, కెనాల్‌రోడ్డు, ప్రకారం బ్యారేజీ ఇలా ఏ రోడ్డు చూసినా అమ్మ వారికి సారె సమర్పించేందుకు విచ్చేస్తున్న భక్త బృందాలే దర్శనమిచ్చాయి. భక్తులు కుటుంబ సమేతంగా తరలిరావడం కనిపించింది.
8 గంటలకే క్యూలైన్లు కిటకిట..
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సారె సంబరాలు రాత్రి 9గంటల వరకు ఏకధాటిన కొనసాగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆదివారం తెల్లవారుజామునే నగరానికి చేరుకుని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దుర్గాఘాట్ భక్తులతో కిటకిటలాడింది. దుర్గగుడి ఈవో శీనానాయక్ దుర్గాఘాట్, కేశఖండనశాలను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు లేకుండా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశా రు. ఉదయం 8 గంటలకే భక్తుల వాహనాలతో హెడ్ వాటర్ వర్క్స్, సీతమ్మవారి పాదాలు, వీఎంసీ కార్యాలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనం, పది గంటల నుంచి అన్ని దర్శన టికెట్ల విక్రయాలను దేవస్థానం రద్దు చేసింది. క్యూలైన్లలో భక్తు లు త్వరత్వరగా ముందుకు కదిలేలా అధికారులు చర్య లు తీసుకున్నారు. మొత్తం 5 క్యూలైన్ల ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించారు.
మహామండపం మొదటి అంతస్తుకు క్యూ..
ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో అటు ఘాట్‌రోడ్డులోని క్యూలైన్లు ఓం టర్నింగ్ వరకు కిటకిటలాడాయి. ఇక మహామండపం 7వ అంతస్తు నుంచి మొదటి అంతస్తు వరకు అన్ని క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించడం విశేషం. గతంలో భక్తుల క్యూ లైన్ మహా మండపం మొదటి అంతస్తుకు చేరిన సందర్భాలు లేవని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. అటు ఘాట్‌రోడ్డు, ఇటు మహా మండపం మొదటి అంతస్తు వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించడంతో భక్తులు అమ్మవారి పాత మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకోవడం కనిపించింది. మధ్యాహ్నం మహా నివేదన సమయానికి పాత మెట్లు కూడా పూర్తిగా నిండిపోవడంతో తోపులాట జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.


