కొనుగోలు పేరుతో నమ్మించి మోసగించిన చంద్రబాబు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రోడ్డెక్కుతున్న అన్నదాతలు నేడు పర్చూరులో ఇన్‌చార్జి మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ
అండగా వైఎస్సార్‌సీపీ
పర్చూకు(చినగంజాం): భారీగా పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టించి పొగాకు పంట పండించిన రైతులను కూటమి ప్రభుత్వం ముంచింది. కొనుగోలు పేరుతో రైతులను నమ్మించి మోసగించింది. గడచిన రెండేళ్లుగా పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశతో ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగులుతోంది. తాము పండించిన పంట కళ్లెదుటే పాడై పోతుంటే పుట్టెడు దుఃఖంతో రోడ్డెక్కుతున్నారు.
పర్చూరులో ఎక్కువ..
దేశంలో పొగాకు పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కాగా అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు ప్రాంతంలో పొగాకు పంటను రైతులు ఎక్కువగా పండించారు. 2022–23, 2023–24 సీజన్‌లో పొగాకు పంటకు గిట్టుబాటు ధర దక్కడంతో రైతులు భారీగా సాగు చేశారు. క్వింటా ధర కనీసం రూ.16 వేలు నుంచి రూ.18 వేలు వరకు పలికింది. 2024–25 పంట సీజన్‌లో పర్చూరు ప్రాంతంలో పొగాకు రైతుల రెట్టించిన ఉత్సాహంతో ఎక్కువ విస్తీర్ణంలో భారీగా పెట్టుబడులు పెట్టి అధిక సంఖ్యలో సుమారు 8 లక్షల క్వింటాళ్ల పైగా పంటను పండించారు. 2024–25లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకొని వారికి మద్దతు కల్పించడంలో విఫలమైంది.
వైఎస్సార్ సీపీ చొరవతో..
భారీగా పెట్టుబడులు పెట్టి గిట్టుబాటు ధరలేక అప్పుల ఊబిలో కూరుకుపోతూ నష్టాల పాలవుతున్న రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు వెన్నుదన్నుగా నిలవడంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా నామమాత్రంగా కొనుగోలు చేసింది. గతంలో రూ.18 వేలు పలికిన క్వింటా పొగాకు ధర మార్క్‌ఫెడ్ ద్వారా రూ.12 వేలు, రూ.9 వేలు, రూ.6 వేలకు కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన కొద్దిపాటి పొగాకు కూడా కూటమి నాయకుల సిఫార్సుల మేరకు కొనుగోలు చేసింది. ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు 3.5 లక్షల క్వింటాలు కన్నా ఎక్కువ కొనలేదు. దీంతో రైతులు వద్ద సుమారు 5 లక్షల క్వింటాళ్లపైగా పొగాకు నిల్వలు నిలిచిపోయాయి. పర్చూరు నియోజకవర్గంలో ప్రస్తుతం మిగిలిపోయిన పొగాకు ధర క్వింటా రూ.1500, రూ.2500 పలుకుతుండటంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పొగాకు సాగును ప్రభుత్వం ప్రోత్సహించడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం గత సీజన్‌లో పొగాకు రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులు సాగును పూర్తిగా నిలిపివేశారు. అటువంటి సందర్భంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి వారికి గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాల్సిన పరిస్థితిని కల్పించాలని కోరుతూ రైతులు రోడ్డెక్కుతున్నారు.
గత సీజన్‌లో క్రాప్ హాలిడేని ప్రకటించి పొగాకు సాగును నియంత్రించిన ప్రభుత్వం రైతుల వద్ద మిగిలిపోయిన పొగాకును పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పర్చూరు నియోజకవర్గంలో పొగాకు రైతుల సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వాన్ని పొగాకు కొనుగోళ్లు చేపట్టాలని రైతులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటాం.
–గాదె మధుసూదనరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి


