పెదకాకానిలో ఘనంగా శాకంబరి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

పెదకాకానిలో ఘనంగా శాకంబరి ఉత్సవాలు

Aug 3 2026 1:19 AM | Updated on Aug 3 2026 1:19 AM

పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని భ్రమరాంబ అమ్మవారిని ఆదివారం శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, సుగంధ ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించారు. అంతరాలయం, ఆలయ ప్రాంగణం, ధ్వజస్తంభం వద్ద పండ్లు, ఆకుకూరలు, కూరగాయల తోరణాలతో తీర్చిదిద్దారు. ఆలయ డిప్యూటీ కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌ పర్యవేక్షణలో స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, అర్చకులు, వేదపండితులు శాకంబరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారుతాలయంలోని విఘ్నేశ్వరుణ్ణి, నందీశ్వరుడిని, ప్రసన్నాంజనేయస్వామి వారిని, భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిని కూడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో చక్కగా అలంకరించారు. భక్తులందరికీ ప్రత్యేక దర్శనం, అన్న ప్రసాదం ఏర్పాట్లు చేసినట్లు డీసీ తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు దంపతులు, పాలకవర్గం సభ్యులు పెదకాకాని ప్రధాన సెంటర్‌ నుంచి ఆషాఢ సారెతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కదంబ ప్రసాదం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement