ప్రభుత్వ విజయాలంటూ ఆర్భాట ప్రచారంలో మిత్రపక్షాలకు పరాభవం రెండేళ్ల పాలన కరపత్రంలో చంద్రబాబు, లోకేష్ ఫొటోలకే ప్రాధాన్యం
చీరాల: కూటమి ప్రభుత్వం విజయాలను వివరిస్తున్న కరపత్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చిత్రాలకు మాత్రమే చోటు కల్పించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్రమోదీతోపాటు బీజేపీ నాయకుల చిత్రాలు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో టీడీపీ చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మొత్తం 45 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లాలనే లక్ష్యంతో గత నెల 27న కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజు స్థానిక ఎమ్మెల్యే, కూటమి పార్టీల నాయకులు ఆర్భాటంగా పాల్గొని కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులే ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందించి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సభలు, సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం మూడు పార్టీల ఉమ్మడి పాలన అయినప్పటికీ ప్రచారంలో భాగస్వామ్య పార్టీలకు ప్రాధాన్యం లేకపోవడం పొత్తు ధర్మానికి విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అప్పుడు అవసరం కాబట్టే...
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి జనసేన, బీజేపీలు శక్తివంచన లేకుండా పనిచేశాయి. ఎన్నికల ముందు నిర్వహించిన ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ’ ప్రచారంలో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని వినియోగించారు. అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రాన్ని కూడా ముద్రించకపోవడం బీజేపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి. ఇటీవల జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు బలం ఉన్న స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సర్దుబాట్లు స్థానిక ఎన్నికలకు వర్తించవని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కూటమి ప్రభుత్వ విజయాలన్నీ టీడీపీ ఖాతాలో వేసుకునే ప్రయత్నమా? లేక స్థానిక ఎన్నికలకు ముందు రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకునే వ్యూహమా? అనే చర్చ సాగుతోంది.
కరపత్రంలోనే కిరికిరి...
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై నిర్వహిస్తున్న ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రంపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమంపై అభ్యంతరం లేకపోయినా, పేరు, నిర్వహణ తీరు వివాదానికి దారితీసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉమ్మడిగా ఉంటే ప్రచారం మాత్రం ఒక్క పార్టీ పేరుతో ఎందుకు నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తల నుంచి తలెత్తుతున్నాయి. బీజేపీ కూడా కూటమిలో భాగస్వామే అయినప్పటికీ ప్రచారంలో ఆ పార్టీ పాత్ర కనిపించకపోవడం చర్చకు కారణమైంది. టీడీపీ సంస్థాగత బలోపేతం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమమా? లేక ప్రభుత్వ విజయాలను వివరించే ఉమ్మడి ప్రచారమా? అనే అంశంపై స్పష్టత లేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, టీడీపీ గుర్తింపును మరింత బలోపేతం చేయడమే ఈ ప్రచారం వెనుక ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ శ్రేణులు ఈ పరిణామంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ధర్మంపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ,
అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ ప్రచారంలో పంపిణీ చేస్తున్న కరపత్రాలు రాజకీయ చర్చకు దారితీశాయి.
కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నా... సరిపడా బస్సులు లేక వారు ఇబ్బంది పడుతున్నారు. మిగిలిన పథకాలలో చాలావరకు గత ప్రభుత్వంలో అమలైనవేనని, వాటికి పేర్లు మార్చి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. కానీ పూర్తిస్థాయిలో అమలు మాత్రం చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. తల్లికి వందనం పథకం తొలి ఏడాది అమలు కాలేదని, తర్వాత కూడా పలు ఆంక్షలతో అర్హులను తగ్గించారని విమర్శలు వస్తున్నాయి. అన్నదాత సుఖీభవ వంటి పథకాలలో కోతలు విధించారని ప్రజలు ఆరోపించారు. రెండేళ్లుగా నేతన్న నేస్తం అమలు కాలేదని, ఆటోడ్రైవర్లకు కూడా ఒక ఏడాది మాత్రమే సాయం అందించారని పేర్కొంటున్నారు. నిరుద్యోగ భృతి, పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్, కొత్త పెన్షన్ల అమలు జరగకపోవడం ప్రభుత్వానికి మైనస్‌గా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకటించిన పథకాలన్నీ పూర్తిస్థాయిలో అమలు కాకుండా అనేక నిబంధనల పేరుతో పరిమితులు విధిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీల్లో పాలకవర్గాలు లేక ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండటంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ప్రజలు ఈ సమస్యలనే నాయకుల దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం.


