మెగా పేరిట దగా డీఎస్సీ | - | Sakshi
Sakshi News home page

మెగా పేరిట దగా డీఎస్సీ

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

నిరుద్యోగులను నట్టేట ముంచేసిన చంద్రబాబు సర్కార్‌

ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం

చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు, అవినీతి విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన పాలకుల అవకతవకలు వైఎస్సార్‌ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, యువత నిరసన

నిరుద్యోగులను నట్టేట ముంచేసిన చంద్రబాబు సర్కార్‌

బాపట్ల: నిరుద్యోగులను మోసం చేస్తూ కూటమి సర్కారు నిర్వహించిన దగా డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్‌ చేశారు. దగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు యల్లావుల సోహిత్‌యాదవ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి రథంబజారు మీదుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ కూటమి సర్కారు వచ్చాక అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. విద్యార్థులు, నిరుద్యోగుల మెడకు ఊరితాడు బిగించినట్లు వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. ఎంతో బాధ్యత కలిగిన డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతను కాంట్రాక్టు ఉద్యోగికి అప్పగించటం, విమర్శలు వచ్చిన వెంటనే ఆయనను అక్కడి నుంచి తప్పించటం చూస్తుంటే అక్రమాలు ఎలా జరిగాయో అర్థం అవుతోందన్నారు. ఒక పక్క కనీసం పరీక్షలు రాసిన వారికి ర్యాంకింగ్‌లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. వారు చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని తప్పులమీద తప్పులు చేశారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వీటిపై సీబీఐతోగానీ, సిట్టింగ్‌ జడ్జితోగానీ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగుల ద్రోహి చంద్రబాబు

డీఎస్సీ నిర్వహణ, నిరుద్యోగులకు భృతి ఇవ్వకపోవటం చూస్తుంటే నిరుద్యోగుల పాలిట ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి పేర్కొన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పటంతోపాటు వలంటీర్లుకు రూ.10 వేలు ఇస్తామని నాలుగు లక్షల మందిని తొలగించిన రోడ్డున పడేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కిందన్నారు. 65 సంవత్సరాలకు ఉన్న పెన్షను అర్హతను వైఎస్సార్‌సీపీ అధినేత, నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తగ్గించి 60 సంవత్సరాలకు ఇచ్చారన్నారు. 50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామని చెప్పి మాట తప్పిన చంద్రబాబు ఇప్పుడు అర్హులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులు డీఎస్సీపై ఆశలు పెట్టుకుంటే అందులోనూ వారికి సంబంధించిన వారికే పోస్టులు దక్కేలా కుట్రలు చేసి మరోసారీ తన నైజాన్ని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. బాపట్లతోపాటు రాష్ట్రంలోని మెడికల్‌ కళాశాలల పనులు నిలిచిపోవటం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగిపోవటంతో ప్రజలు ఈ నీచ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నారని కోన చెప్పారు. వైఎస్సార్‌సీపీ సర్కారు ఏర్పాటు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం డీఎస్సీలో అక్రమాలకు పాల్పడటం సరికాదని, ఈ విషయంలో విద్యార్థి విభాగం తమ సత్తా చూపుతుందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు యల్లావుల సోహిత్‌యాదవ్‌ పేర్కొన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేలా నిరుద్యోగులు, విద్యార్థి లోకాన్ని మభ్యపెట్టాలనే ప్రయత్నాలు ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు వెలికితీయాల్సిందని డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో భాగంగా డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసిన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎల్లావుల ఏడుకొండలు, చల్లా రామయ్య, రాష్ట్ర విద్యార్థి విభాగం కమిటీ జనరల్‌ సెక్రటరీ షేక్‌ పర్వేజ్‌, వడ్డిముక్కల రవితేజ, అడే చందు, మాచవరపు రవి, ఉరబిండి గోపి, గోసాల అశోక్‌, ప్రశాంత్‌రెడ్డి, పేర్తీ రిషివర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement