గుంటూరు మెడికల్: రోడ్డు ప్రమాదాలకు గురై అనేక ఎముకలు విరిగిన వారిలోనూ, వివిధ ఎముకలు, కీళ్లు, మెదడు, వెన్నెముక తదితర చికిత్సల అనంతరం కదలికలు లేని వారిలో పల్మనరీ ఎంబాలిజం ప్రాణాంతకంగా పరిణమిస్తున్నదని అమృత హాస్పిటల్స్ మత్తు, ఇంటెన్సివ్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీప్రసన్న అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖ, ఐఎస్‌సీసీఎం సంయుక్తంగా జీఎంఏ హాల్లో వైద్యులకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. డాక్టర్ లక్ష్మీప్రసన్న పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ టి.సేవ కుమార్ అధ్యక్షత వహించారు. డాక్టర్ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ఐసీయూలో దీర్ఘకాలంగా శారీరక కదలికలు లేని వారిలోనూ, రక్తనాళాలలో రక్తపు గడ్డల(డీప్ వేయిన్ త్రంబోసిస్)తో బాధపడుతున్న వారిలోనూ, ఎముకలు, మెదడు సంబంధం శస్త్రచికిత్సలు చేసిన వారిలో ను పల్మనరీ ఎంబాలిజంను ఎక్కువగా గుర్తించటం జరుగుతుందని చెప్పారు. నిర్ణీత సమయంలో చికిత్స చేయలేకపోతే మరణం తప్పదని వెల్లడించారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అంజత్ ఉప్పుటూరి మాట్లాడుతూ ఊపిరితిత్తులలోని రక్తపు గడ్డల విషయంలో అత్యవసర చికిత్సలవైద్య నిపుణులు ఎంతో నైపుణ్యంతో వ్యవహరించాలని చెప్పారు. న్యూరోసర్జన్ డాక్టర్ హేమంత్ ఉప్పుటూరి మాట్లాడుతూ ప్రమాదాలలో మెదడు గాయాలైనప్పుడు వారి మానసిక ,శారీరక పరిస్థితులను బట్టి రేడియోలాజికల్ పరీక్షలు అవసరమవుతాయన్నారు. ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ మద్ది వినోద్ కుమార్ మాట్లాడుతూ అరుదైన వ్యాధులు సోకినవారు ఎంతో అరుదుగా వైద్యుల్ని ఆశ్రయించినప్పుడు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వక్తలకు ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షులు టి.సేవకుమార్, కార్యదర్శి బి.సాయికష్ణ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఐఎంఏ గుంటూరు శాఖ ఉపాధ్యక్షులు డాక్టర్ శివప్రసాద్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సిహెచ్.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


