అంగరంగ వైభవంగా రథోత్సవం భక్తుల నినాదాలతో మార్మోగిన రథస్థలి వేల సంఖ్యలో తరలి వచ్చిన యువత
మాచర్ల: పల్నాడు ప్రజల ఆరాధ్య దైవం, భక్తుల కొంగుబంగారంగా పిలుచుకునే శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా సాగింది. వేలాది మంది భక్త జన సందోహంతో కనుల పండువగా వేడుక జరిగింది. శ్రీదేవి భూదేవి చెన్నకేశవ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి రథం పైకి ఎక్కించి కుమ్మరి వారు కుంభం పోసి హారతి రథం ఊరేగింపునకు సిద్ధం చేశారు. అర్చకులు అడిగొప్పల చెన్నకేశవాచార్యులు, శ్రీనివాసాచార్యులు, చైర్మన్ కొమెర అనంతరాములు, ఈఓ సైదారావుల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి రథోత్సవంలో పాల్గొన్నారు. అర్చకులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హారతినిచ్చి రథం ముందు దిష్టి గుమ్మడికాయ దిష్టి తీసి రథం ఊరేగింపును ప్రారంభించారు. రథంపై నగారా మోగిస్తూ జై చెన్నకేశవ అంటూ భక్తులు గొలుసులు చేతబట్టి రథాన్ని పురవీధుల్లో నడిపించేందుకు ఉత్సాహంగా పోటీ పడ్డారు. రథశాల నుంచి లక్ష్మీదేవి మిద్దెల మీదుగా బురుజు సెంటర్ వరకు జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ నినాదాల మధ్య, గోవింద నామస్మరణతో రథోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. బ్రహ్మోత్సవాలలోని ప్రముఖ ఘట్టమైన రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పల్నాటి ప్రాంతం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పారవశ్యంతో పులకించారు. ఆర్యవైశ్య సంఘం, ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం, ప్రసాదాలు పంపిణీ చేశారు. ముందుగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి శ్రీదేవి, భూదేవి లను ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. యువకులు పోటీ పడి రథాన్ని లాగారు. ఏఎస్పీ సంతోష్, గురజాల ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు తరలివచ్చి బందోబస్తు నిర్వహించారు. పలు సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రసాదాలు, పానీయాలు, అన్నదానం చేశాయి. మాచర్ల పట్టణంలో ఎటుచూసినా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి తిరునాళ్ల సందడి కనబడింది. సాయంత్రం రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహం చూపారు.


