గుంటూరు రూరల్: కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవాలు మంగళవారం కనుల పండువగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలను నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజల యోగక్షేమాల కోసం ప్రత్యేకంగా అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సిడిమాను ఊరేగింపు మహోత్సవానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయించి, బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గుడికి వచ్చే రాకపోకల మార్గాల్లో 12 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేశామని తెలిపారు. ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, ఆలయ ఈవో జక్కా శ్రీనివాసరావు, కాకుమాను ఎస్సై హరికృష్ణ, ప్రత్తిపాడు ఎస్సై నరహరి, ఇతర శాఖల అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


