భట్టిప్రోలు: భట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. దీనివల్ల భట్టిప్రోలు మండలం నుంచి ప్రజలు సులువుగా తమ సమస్యలను విన్నవించేందుకు అవకాశం ఉంటుందని జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట అన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధరగౌడ్, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్. విజయమ్మ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయ నిర్మల, డీఎస్‌వో జమీర్ బాషా, ఎంపీడీవో సాతులూరి వెంకటరమణ, ఇన్‌చార్జి తహసీల్దార్ వి. వెంకటేశ్వర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కాగా, పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ఉంటుందని అధికారులు ప్రకటించారు. కానీ 11:30 గంటలకు ప్రారంభమైంది. కలెక్టర్ రాకపోవడంతో జాయింట్ కలెక్టర్ 72 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. రెండున్నర గంటలపాటు అర్జీదారులు అధికారుల కోసం నిరీక్షించారు.


