మీకు ఓట్లు వేసిన పాపానికి ఇబ్బందులు పెడతారా? 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను తొలగించడానికి చర్యలా? రైల్వే అధికారులు వచ్చి నివాసాలు కూలుస్తామంటున్నారు ఎమ్మెల్యే తీరుపై మోతీలాల్ నగర్ వాసుల ఆవేదన
నెహ్రూనగర్: ‘మీకు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి మమ్మల్ని ఇప్పుడు రోడ్లపాలు చేయాలని చూస్తున్నారా.. ఎమ్మెల్యే గారు.. మా ఇళ్లు కూల్చేందుకు రైల్వే అధికారులు వస్తున్నారు.. మీరు వచ్చి అడ్డుకోవాలి. లేదంటే మాపైనుంచి జేసీబీలు పంపి ప్రాణాలు తీశాకే నివాసాలు కూల్చండి’ అంటూ నెహ్రూనగర్ పరిధిలోని మోతీలాల్ నగర్ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెహ్రూనగర్ రైల్వే గేటు దగ్గరలోని మోతీలాల్‌నగర్‌లో గత 60 సంవత్సరాలుగా పలు పేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ట్రాక్ పక్కనే డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఆ పనులతో సుమారు 80 కుటుంబాలకు చెందిన నివాసాలు పూర్తిగా తొలగించే పరిస్థితి నెలకొంది. కూల్చివేతలకు చర్యలు తీసుకుంటున్నారని తెలిసి వారు దిక్కుతోచని స్థితిలో ఆందోళన బాట పట్టారు.
ప్రత్యామ్నాయం చూపాకే తొలగించండి
అర్ధంతరంగా మా ఇళ్లును తొలగించాలని రైల్వే అధికారులు వస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వద్దకు వెళితే కనీస వసతులు లేని ప్రాంతాల్లోకి వెళ్లి ఉండాలని ఆయన చెబుతున్నారని వాపోయారు. అక్కడ ఉండే పరిస్థితులు లేవని తెలిపారు. కనీసం ఉండేందుకు మౌలిక వసతులు కల్పిస్తే అక్కడికి వెళ్తామని చెప్పినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేసి గెలిపిస్తే ఏసీ రూముల్లో ఉంటూ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికా తాము ఓట్లు వేసి గెలిపించిందంటూ ఆగ్రహిస్తూ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మా ఇళ్లను కూల్చ వద్దంటూ రైల్వే అధికారులను కోరినప్పటికీ బుధవారం ఉదయం జేసీబీలతో వచ్చి కూలుస్తామని చెప్పారని బాధితులు వాపోయారు. మంగళవారం రాత్రి కరెంట్ కట్ చేసేందుకు వచ్చారని వాపోయారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వచ్చి ఈ కూల్చివేతను ఆపాలని, లేకపోతే తమను చంపిన తరువాత కూల్చాలని బాధితులు విలపిస్తూ కోరారు. తమకు తగిన న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.


