ముగిసిన జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు రెండో ప్రదర్శనగా ‘మమ్మల్ని బతికించండి’ నాటిక పోటీల నిర్వహణపై ప్రముఖుల ప్రశంసలు
మహిళా కళాకారులకు అపూర్వ గౌరవం
యడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం వేదికగా మూడు రోజులపాటు సాగిన 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఆద్యంతం పారదర్శకంగా, హృద్యంగా సాగిన ఈ వేడుక నాటక ప్రేమికుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.
ఉత్తమ ప్రదర్శనగా ‘అమ్మ చెక్కిన బొమ్మ’
ఉత్తమ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్(హైదరాబాద్)వారి ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటిక, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ సాంస్కృతిక సమితి(విజయవాడ) వారి ‘మమ్మల్ని బ్రతకనివ్వండి’ నాటిక. ఉత్తమ తృతీయ ప్రదర్శన స్వర్ణసూర్య డ్రామా లవర్స్ (హైదరాబాద్) వారి ‘సీ్త్రమాత్ర నమః’ నాటిక. చతుర్థ ప్రదర్శన ఉషోదయ కళానిలయం(కట్రపాడు) ‘మంచి మనసులు’ నాటిక. వీటితోపాటు ‘కన్నీటికి విలువెంత..‘మాతృత్వం’ నాటికలు ప్రత్యేక ప్రదర్శన బహుమతుల్ని సాధించుకున్నాయి.
తెరవెనుక కృషీవలురు
ఉత్తమ నాటక రచనకు..మంచి మనసులు, అమ్మచెక్కిన బొమ్మ, ఉత్తమ దర్శకులు, ఉత్తమ సంగీత దర్శకులు అమ్మచెక్కిన బొమ్మ, ఉత్తమ రంగాలంకరణ మమ్మల్ని బ్రతకనివ్వండి, ఉత్తమ ఆహార్యం చిటికెన వేలు నాటికలకు లభించాయి.
వేదికపై వెలిగిన కళాకారులు
ఉత్తమ నటీమణులు..అనసూయ పాత్రధారి జ్యోతిరాజ్ భీశెట్టి (అమ్మచెక్కిన బొమ్మ), రమణమ్మ పాత్రధారి ఆర్ రాజేశ్వరీ (మమ్మల్ని బ్రతకనివ్వండి), ఉత్తమ నటులు చిట్టి పాత్రధారి కార్తీక్ (సీ్త్రమాత్రే నమః), శశి–2 పాత్రధారి భానుప్రకాష్ (అమ్మచెక్కిన బొమ్మ), సోమన్న పాత్రధారి కె సత్యనారాయణ (చిటికెలవేలు) బహుమతుల్ని గెలుచుకున్నారు. ద్వితీయ ఉత్తమ నటులు..వైబీ చౌదరి (దీపం కింద చీకటి), పొగర్తి నాగేశ్వరరావు (మాతృత్వం), ఉదయ భాగవతుల (సీ్త్ర మాత్రే నమః), పీఎస్ పవన్‌కుమార్ (మమ్మల్ని బ్రతకనివ్వండి), అమృత వర్షిణి (మంచి మనసులు) నటులకు దక్కాయి.
కళా సేవకులకు సన్మానం...
కళా, సామాజిక రంగాల్లో విశేష కృషి చేసి, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలు అందుకున్న ఈదర హరిబాబు, రాయప్రోలు భగవాన్, నన్నపనేని రాఘవరావు, జాస్తి వెంకట మోహన్‌రావు, బుడ్డా వెంకట రామారావు, అన్నమనేని ప్రసాదరావు, కాట్రగడ్డ కృష్ణప్రసాద్‌లను కమిటీ సన్మానించారు. అనంతరం ముఖ్య అతిధి నాటక రంగ విశ్లేషకులు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, సన్మానితులు ప్రసంగించారు. నాటక కళను బతికించేందుకు సురేష్‌బాబు దంపతులు చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. కార్యక్రమంలో పరిషత్ కార్యవర్గం జరుగుల రామారావు, శంకర్రావు, నూతలపాటి కాళిదాసు, ఆలోకం పెద్దబ్బయ్య, నూతలపాటి మాధవరావు, చెరుకూరి సృజన, షేక్ బాజి, నంబూరి శ్రీనివాసరావు, ఎం పద్మారావు, పోపూరి అనంతలక్ష్మి, సీహెచ్ హనుమంతరావు, కె సులోచన, తోకల కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కట్టా శ్రీహరి, సాంబశివరావు, పోపూరి శివరామకృష్ణ, జగన్, మాణిక్యమ్మ, మానుకొండ రామారావు ఉన్నారు.
రంగస్థల చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా స్టేజీపై నటించిన 19 మంది మహిళా కళాకారులకు ఆడపడుచు లాంఛనాలతో (చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు) సత్కరించారు. గ్రామవాసి డాక్టర్ ముత్తవరపు భార్గవిచౌదరి ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా, ఉత్తమ రచన, దర్శకత్వ విభాగాలకు నగదు బహుమతులు అందజేశారు. అలాగే నాటికలను వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులకు లక్కీ డ్రా నిర్వహించి, మూడు రోజుల్లో మొత్తం 120 మందికి బహుమతులు అందజేశారు. ప్రతిరోజూ రాత్రి ప్రేక్షకులకు అల్పాహారం ఏర్పాటు చేయడం విశేషం.


