గుంటూరు మెడికల్: బీపీ మండల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో సోమవారం కలిశారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్‌ల అంశంపై జరిగే సమావేశానికి ఆహ్వానించారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏప్రిల్ 19న విజయవాడలోని మాకినేని బసవపునయ్య విజ్ఞాన కేంద్రంలో చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్‌ల ఆవశ్యకత అనే అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొని చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లపై తమ వైఖరిని వెల్లడించాలని సజ్జల రామకృష్ణారెడ్డిని కోరారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్‌లకు అనుకూలమని తెలిపారు. తమ పార్లమెంటరీ పార్టీ గతంలోనే రాజ్యసభలో ఈ విషయం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. 19న జరిగే అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ పాల్గొని తమ వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. సజ్జలను కలిసిన వారిలో రైల్వే ఓబీసీ సంఘ అధ్యక్షుడు బీవీఎన్ సత్యనారాయణ, నాయకులు ఉన్నారు.
భట్టిప్రోలు: భట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయం సమావేశపు హాలులో మంగళవారం ఉదయం 9 గంటలకు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సాతులూరి వెంకట రమణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పాల్గొంటారని తెలిపారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
బాపట్ల: బాపట్ల జిల్లా కోర్టు బార్ అసోసియేషన్‌కు 2026–2027 సంవత్సరానికి సోమవారం జరిగిన ఎన్నికలలో నూతన అధ్యక్షులుగా విన్నకోట సత్యప్రసాద్ ఘన విజయం సాధించారు. బాపట్ల జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఉపాధ్యక్షులుగా కంచర్ల రవిబాబు, ప్రధాన కార్యదర్శిగా సి ప్రేమ్‌చంద్, లైబ్రరీ కార్యదర్శిగా కారుమూరి సురేంద్ర నాథ్, సాంస్కృతిక కార్యదర్శిగా చాపల వెంకట ప్రవీణ్ కుమార్‌లు గెలుపొందారు. నూతనంగా ఎన్నికై న వారిని పలువురు ప్రముఖులు అభినందించారు.
మంత్రి లోకేష్‌కు జెడ్పీ చైర్‌పర్సన్ వినతి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.34 కోట్ల రిజిస్ట్రేషన్ సర్‌చార్జి నిధులు విడుదల చేయించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా విజ్ఞప్తి చేశారు. సోమవారం మంత్రి లోకేష్‌ను ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసిన హెనీ క్రిస్టినా, కత్తెర సురేష్‌కుమార్ దంపతులు జెడ్పీకి రావాల్సిన నిధులు, బకాయిల విషయమై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన లోకేష్ నిధుల విడుదలకు హామీ ఇచ్చినట్లు హెనీ క్రిస్టినా తెలిపారు.
మాచర్ల: సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో ఆమె తండ్రి కామనబోయిన చంద్రశ్రీను, మేనమామ పచ్చిపాళ్ల శ్రీనులను సోమవారం రాత్రి గురజాల ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటరమణ అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన చంద్ర శ్రీను కుమార్తె ప్రేమించిన నాగరాజుతో వెళ్లి వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించి చౌడేశ్వరి అదృశ్యమైనట్లు, దానికి కారణం జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజు అని మృతురాలి తల్లిదండ్రులు చంద్రశ్రీను, గంగమ్మలు పోలీసులను ఆశ్రయించారు. ఆ తరువాత ఈ నెల 18న చౌడేశ్వరి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పారు. అయితే ఇది హత్య కేసుగా పోలీసు పరిశోధనలో తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్య కేసులో నిందితులు చంద్రశ్రీను, పచ్చిపాళ్ల శ్రీనులను అరెస్టు చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అర్థరాత్రి హాజరుపర్చనున్నారు.


