గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సలాం సెంటర్‌లో కార్డన్ సెర్చ్ పాత నేరస్తుల ఇళ్లు పరిశీలన 65 వాహనాలు సీజ్
తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం తెల్లవారుజామున మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి పట్టణం సలామ్ హోటల్ సెంటర్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఈ కార్యక్రమంలో పాల్గొని గతంలో గంజాయి, ఇతర కేసుల్లో పట్టుబడిన వారి నివాసాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపుగా 200 నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎస్పీతోపాటు నార్త్‌జోన్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, జిల్లా కేంద్రంతోపాటు తాడేపల్లి, మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్ల నుంచి దాదాపు 100 మంది సిబ్బంది పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్ అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి విక్రయించడంతో పాటు తాగుతున్నారని సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 39 ప్రాంతాల్లో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. తాడేపల్లిలో పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేశామని, సలాం హోటల్ సెంటర్‌లో నిర్వహించగా 65 ద్విచక్రవాహనాలకు ఎటువంటి పత్రాలు లేకుండా ఉన్నాయని, వాటన్నింటి పత్రాలను పరిశీలించి డాక్యుమెంట్ ఉన్న వాహనాలను ఇచ్చివేస్తామని, లేని పక్షంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు.


