‘పది’లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
సత్తెనపల్లి: పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎగ్జామినేషన్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ కె.ఎం.ఎ.హుస్సేన్ అన్నారు. రాష్ట్ర పాఠశాల కమిషనర్ వి.విజయరామరాజు ఆదేశాల మేరకు జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్.చంద్రకళ నేతృత్వంలో ఆదివారం నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల డివిజన్‌లలోని పలు మండల కేంద్రాల్లో ఉప విద్యా శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. హుస్సేన్ మాట్లాడుతూ రెగ్యులర్ విద్యార్థులతోపాటు దూర విద్యలో పదో తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు కూడా పరీక్షల కోసం పదో తరగతి పరీక్ష కేంద్రాలను వినియోగించనున్నామన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై ఈఏడాది పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో బోధన కొనసాగించాలన్నారు. టెన్త్ పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఆ మేరకు ఎంఈఓలతోపాటు, ప్రతి పరీక్ష కేంద్రాన్ని స్వయంగా సందర్శిస్తామన్నారు. పరీక్ష కేంద్రానికి పూర్తి సదుపాయాలు ఉంటేనే అనుమతి ఇస్తున్నామన్నారు. జంబ్లింగ్ విధానంలో కేంద్రాల కేటాయింపు ఉంటుందన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం ఉండదన్నారు. ఎక్కడైనా కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే ఆ ఉపాధ్యాయులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షల్లో 49 పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 40 శాతం కంటే తగ్గిందన్నారు. ప్రతి మండలంలో ఉత్తీర్ణత శాతం వంద శాతానికి పెంచాలన్నారు. దీనికి ఎఫ్‌ఏ1, ఎఫ్‌ఏ2 మార్కుల ఆధారంగా ఏ, బీ గ్రేడ్‌వారు, సీ,బీ గ్రేడ్‌లవారీగా విభజించి డీసీఈబీవారు ఇచ్చిన మెటీరియల్‌ను నవంబరు 30లోపు సిలబస్ పూర్తి చేసి వంద రోజుల వంద రోజుల ప్రణాళిక ద్వారా ఉపాధ్యాయులు మెరుగైన బోధన చేపట్టి విద్యార్థులు ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. గతంలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలు ఉన్నాయని, ఈఏడాది ప్రభుత్వం మెగా డీఎస్సీ 2025 ద్వారా అన్ని పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ చేయడం జరిగిందన్నారు. వివిధ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులందరూ ప్రత్యేక తరగతులు తప్పకుండా నిర్వహించాలన్నారు. ఆయతోపాటు ఉప విద్యా శాఖ అధికారులు ఎస్‌ఎం సుభాని (నరసరావుపేట), వి.ఏసుబాబు (సత్తెనపల్లి), మండల విద్యా శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.
ఎగ్జిమినేషన్ విభాగం
అసిస్టెంట్ కమిషనర్ హుస్సేన్


