రక్తనాళాలపై అవగాహన పెంచుకోవాలి
గుంటూరు వెస్ట్: రక్తనాళాలపై అవగాహన కలిగి ఉంటే ఎన్నో అనర్థాలను ముందుగానే గుర్తించి సరిచేసే అవకాశముంటుందని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్ పేర్కొన్నారు. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి వాస్కులర్ వాక్‌థాన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రక్తనాళాలు మనిషికి ఎంతో కీలకమని చెప్పారు. నిత్యం వ్యాయామం, చక్కని ఆహార అలవాట్లతోపాటు క్రమం తప్పకుండా మెడికల్ టెస్ట్‌లు చేయించుకుంటే ముందుగానే అరికట్టవచ్చని తెలిపారు. నేటి ఆధునిక యువత అవగాహన లేక అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, వాటిని అరికట్టడానికి ఎన్నో పద్ధతులు సమాజంలో ఉన్నాయని తెలిపారు. వాస్కులర్ సర్జన్ డాక్టర్ వి.విజయకుమార్ మాట్లాడుతూ వాస్కులర్ వాక్‌థాన్‌ను దేశ వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో నిర్వహించారన్నారు. ఊబకాయం, మధుమేహ రోగుల్లో రక్తనాళాల సమస్యల కారణంగా కాళ్లు, చేతులు శాశ్వతంగా తొలగిస్తున్నారన్నారు. ముఖ్యంగా మధుమేహ రోగులు కొద్దిపాటి జాగ్రత్తలతోపాటు అవగాహన కలిగి ఉంటే చాలా ఇబ్బందులను తొలగించే అవకాశముంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రక్తనాళాల సమస్యలకు ఎన్నో ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అనంతరం స్టేడియం నుంచి మదర్‌థెరిస్సా విగ్రహం వద్దకు వాక్ కొనసాగింది. కార్యక్రమంలో వాస్కులర్ సర్జన్స్ సురేష్‌రెడ్డి, సురేంద్ర, రత్నశ్రీ , ఐఎంఏ జిల్లా కార్యదర్శి డాక్టర్ బి.సాయికృష్ణ, ఉపాధ్యక్షులు ఎం.శివప్రసాద్ పాల్గొన్నారు.
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్


