అంబేడ్కర్ స్మృతివనాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలి
చీరాల రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కోపంతో అంబేడ్కర్ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం అవమానిస్తోందని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజీ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చారిత్రాత్మక పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో 18.81 ఎకరాల్లో సామాజిక న్యాయ విగ్రహం పేరుతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. స్మృతివనం ఎంట్రన్స్ ఫీజు మొదటగా రూ.5 గా నిర్ణయించారన్నారు. అయితే అక్కడ పారిశుద్ధ్య పనుల నిర్వహణ లోపం కారణంగా పర్యాటకులు ఎవరూ రావడం లేదన్నారు. కూటమి పార్టీలకు జగన్‌మోహన్‌రెడ్డితో ఉన్న వైరం కారణంగా అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానిస్తున్నారన్నారు. స్మృతివనం నిర్వహణకు తాము కూటమి నేతల డబ్బులు అడుగడం లేదని, సాంఘిక సంక్షేమ శాఖ నిధులు నుంచి నిర్వహణ చేపట్టాలన్నారు. అందులో పనిచేసే కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అపర కుబేరుడు రామోజీరావు స్మారక సభకు రూ.14 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసిన చంద్రబాబు.. అంబేడ్కర్ స్మృతివనానికి నిధులు లేవని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు సబ్సిడీ రుణాలను కూడా ప్రకటించి.. నిధులు నిలిపివేసి ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామన్న ఎన్నికల హామీ తుంగలో తొక్కారన్నారు. స్మృతి వనాన్ని సాంఘిక సంక్షేమ శాఖ నుంచి పర్యాటక శాఖకు అప్పగించడం కూటమి ప్రభుత్వ కుట్రపూరిత వివక్షకు నిదర్శనమన్నారు. స్మతివనం నిర్వహణకు కమిటీ నియమించాలని డిమాండ్ చేశారు. దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడే మాచవరపు జూలియన్, మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాకుమాను రవికుమార్, జి.ఏలియా తదితరులు పాల్గొన్నారు.
దళిత హక్కుల పరిరక్షణ సమితి
రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్ర


