మానవత్వం చాటుకున్న ఎస్‌ఐ
పర్చూరు(చినగంజాం): మృతి చెంది ఆస్పత్రిలో దిక్కులేకుండా పడి ఉన్న వ్యక్తి శవాన్ని వారి బంధువులకు అప్పగించి దహన సంస్కారాలకు సైతం సాయమందించి మానవత్వాన్ని చాటుకున్నారు పర్చూరు ఎస్‌ఐ జీవీ చౌదరి. పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన చీరాల శ్రీనివాసరావు అనే వ్యక్తి తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే అతని కుమారుడు చీరాల సురేష్‌బాబు అతనిని వైద్యచికిత్స కోసమై పర్చూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి కనిపించకుండా వెళ్లిపోయాడు. అటు తరువాత ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు చనిపోయాడు. ఆస్పత్రి వైద్యు లు ఆ విషయాన్ని పర్చూరు పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ జీవీ చౌదరికి తెలియపరిచారు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్‌ఐ తన సిబ్బందిని మృతుని కుమారుడు సురేష్‌బాబు కోసం నూతలపాడు గ్రామానికి పంపి విచారించాడు. మద్యానికి బానిసైన సురేష్ బాబు.. తండ్రి చనిపోయిన విషయాన్ని పట్టించుకోకుండా తాగి తిరుగుతున్నట్లుగా గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. జీవీ చౌదరి.. చనిపోయిన చీరాల శ్రీనివాసరావు బంధువులు గురించి ఆరా తీసి వారు చీరాల హస్తినాపురంలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. వారి బంధువులను, చనిపోయిన శ్రీనివాసరావు కుమారుడు సురేష్‌బాబును పిలిపించి మృతదేహాన్ని వారికి అప్పగించారు. అయితే కనీసం మృతునికి దహన సంస్కారాలు కూడా చేయలేని స్థితిలో ఉన్నారని తెలుసుకుని అవసరమైన సహాయ సహకారాలు అందించారు.
మృతదేహం బంధువులకు అప్పగింత
దహన సంస్కారాలకు సైతం సాయం


