‘హాల్‌మార్క్’ గోల్‌మాల్!
జిల్లాలో బంగారు ఆభరణాల్లోనూ బడా మోసాలు సొంత మిషన్‌లతో అనుమతి లేకుండా హాల్‌మార్క్ సెంటర్ల ఏర్పాటు వేరే వారి హెచ్‌ఐయూఐడీ నంబర్ ఆభరణాలపై ముద్రణ గుంటూరు నగరంలో వెలుగు చూసిన నయా దగా
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1150కుపైగా బంగారం దుకాణాలు, 25 వరకు భారీ షోరూమ్‌లు ఉన్నాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. గుంటూరుతోపాటుగా తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో నకిలీ హాల్‌మార్క్, నాణ్యత లేని బంగారానికి తుది మెరుగులు దిద్ది అంటగడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అంటే కేవలం 15 నుంచి 18 టచ్ ఉన్న దానికి 22 టచ్ ఉన్నట్లు ముద్రణ వేసి విక్రయాలు జరుపుతున్నారని సమాచారం.
అధికారికంగా ఉంటేనే...
బీఐఎస్ హాల్‌మార్క్, హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్‌యూఐడీ) ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఆభరణం మీద ఉన్న హెచ్‌యూఐడీ నంబర్‌ను గూగుల్‌లో సెర్చ్ చేయటం ద్వారా మనం కొనుగోలు చేసిన బంగారు ఆభరణంలో ఎంత బంగారం ఉంది? ఎక్కడ హాల్‌మార్క్ వేశారు..? అనే అంశాలు లభిస్తాయి. లాలాపేటలోని కరీముల్లా జ్యూవెలర్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న లేజర్ మిషనరీతో నకిలీ హాల్‌మార్క్ వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నారు.
అవగాహన అవసరం
ప్రతి నగ కొనుగోలు చేసిన తరువాత బీఐఎస్ ద్వారా నగకు సంబంధించిన హాల్‌మార్క్, ఇతర అంశాలు పూర్తిగా బీఐఎస్ సర్వర్‌లో నమోదవుతాయి. ఆ తరువాత బీఐఎస్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ ఆభరణానికి ఒక హెచ్‌యూఐడీ నెంబర్ వస్తుంది. బీఐఎస్ యాక్ట్ 2016లోని 14 టూ 16 ప్రకారం బీఐఎస్‌కి బంగారు, వెండి ఆభరణాలకు హాల్‌మార్క్ సర్టిఫికేషన్ ఇవ్వటానికి అధికారం ఉంది. హాల్‌మార్కింగ్ ఆఫ్ గోల్డ్ జ్యూవెలరీ అండ్ ఆర్టీఫ్యాక్ట్ ఆర్డర్ 2020 ప్రకారం... 2021 జూన్ 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా బీఐఎస్ హాల్‌మార్క్ ఉన్న నగలనే అమ్మాలని ఆదేశాలు వెలువడ్డాయి. వీటిలో సైతం 14కే, 18కే, 20కే, 22కే, 23కే, 24కే స్వచ్ఛత ఉన్న బంగారాన్ని మాత్రమే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బీఐఎస్ హాల్‌మార్క్ లేకుండా బంగారం విక్రయించటం చట్టప్రకారం విరుద్ధం అని అధికారులు గుర్తుచేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో బంగారానికి సంబంధించిన మోసాలు పెరిగిపోతున్నాయి. నాణ్యతకు మారుపేరుగా భావించే హాల్‌మార్క్‌నూ నకిలీ చేసేశారు. ఈ నెల 6వ తేదీన గుంటూరు పట్నంబజారు దుకాణాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారుల సోదాల్లో ఏకంగా 1.246 కిలోల దొంగ హాల్‌మార్క్‌లు కలిగిన బంగారం దొరకటంపై కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది.


