రహదారులు, చప్టాలు తక్షణ నిర్మాణం
వేటపాలెం: మోంథా తుపానుకు దెబ్బతిన్న రహదారులు, చప్టాలను తక్షణమే నిర్మించాలని కలెక్టర్ వి. వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. వేటపాలెం మండల పరిధిలోని రామాపురం, కఠారివారిపాలెం, పొట్టిసుబ్బపాలెం ప్రాంతాల్లో ఆయన, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ శుక్రవారం పర్యటించారు. వరద ధాటికి రామాపురం వద్ద ధ్వంసమైన చప్టాను పరిశీలించారు. హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి అంచనాలు వేయాలని ఆదేశించారు. వాడరేవు కొత్తపేట, పాపాయిపాలెం గ్రామాల్లో కూలిన చప్టాలను పరిశీలించారు. రామాపురం బీచ్ నుంచి వాడరేవు బీచ్ వరకు రహదారి ఎనిమిది చోట్ల దెబ్బతిన్నట్లు గుర్తించారు. రామాపురం వద్ద కూలిన చప్టాను రూ. 6.5 లక్షలతో, తాత్కాలికంగా మరమ్మతులు చేయవచ్చని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 2 కోట్లతో అంచనాలు తయారు చేసి, ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ చెప్పారు. కొత్తపేటలో చప్టాలకు రూ.12 లక్షలతో తాత్కాలికంగా మరమ్మతులు చేయవచ్చని, శాశ్వత పరిష్కారానికి రూ.3.50 కోట్లతో అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. మిగిలిన వాటికి అంచనాల నివేదికలను ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. సముద్ర తీరం వద్ద గోతులు పడ్డాయని, పర్యాటకులను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు. తీర ప్రాంతాన్ని పరిశీలించకుండా పర్యాటకులను సముద్రంలోకి అనుమతించరాదని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. బీచ్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పొలాల్లో నిలిచిన వరద నీటిని సముద్రంలోకి పూర్తిగా వెళ్లేలా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఆయన వెంట చీరాల ఆర్డీఓ పి. చంద్రశేఖర్, తహసీల్దార్ వంశీకృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్లు ఉన్నారు.
అధికారులకు కలెక్టర్
వి. వినోద్‌కుమార్ ఆదేశం


