వలపర్లలో గత ప్రభుత్వ శిలాఫలకం ధ్వంసం
మార్టూరు : మండలంలోని వలపర్లలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. స్థానికంగా కలకలం రేపిన విషయం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని సత్యం గారి ఇంటి వద్ద నుంచి హైస్కూలుకు వెళ్లే మార్గంలో సీసీ రోడ్డును రూ. 5.50 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించారు. రోడ్డును 1 జూలై 2021న అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ , పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ రావి రామనాథం బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు వివరాలతో పాటు నాయకుల ఫొటోలు, పేర్లతో శిలా ఫలకాన్ని అదే రోడ్డులో ఏర్పాటు చేశారు. దిమ్మెను, దానికి అమర్చిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి రోడ్డుపై పడేశారు. ఈ విషయంపై స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యంపూడి కోటి నాగులు మాట్లాడుతూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


