రైతుల ఆర్థికాభివృద్ధికి ఎన్జీ రంగా అవిరళ కృషి
బాపట్ల: రైతులు, రైతు కూలీల ఆర్థికాభివృద్ధికి అవిరళ కృషి చేసి, వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందించేందుకు ఆచార్య ఎన్.జి. రంగా జీవితాన్ని అంకితం చేశారని ఏజీ కళాశాల అసోసియేట్ డీన్ పి.ప్రసూనరాణి తెలిపారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని వ్యవసాయ విద్యార్థులు రైతు సంక్షేమానికి పాటుపడాలని ఆమె చెప్పారు. ఆచార్య ఎన్.జి.రంగా 125 జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జయంతి సభలో ఆమె మాట్లాడారు. రైతులను రాజకీయ స్పృహ ఉన్న పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆంధ్ర రైతు పాఠశాలను 1934లో స్వగ్రామమైన నిడుబ్రోలులో ప్రారంభించారని తెలిపారు. రైతు తత్వశాస్త్ర ప్రతిపాదకుడుగా వారి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని పొందారని పేర్కొన్నారు. గాంధీ పిలుపుతో స్వాతంత్య్ర ఉద్యమంలో చేరి శాసనోల్లంఘన, సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటం, రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారని వివరించారు. భార్య భారతీదేవితో కలిసి సత్యాగ్రహం (1940), క్విట్ ఇండియా ఉద్యమం (1942)లో పాల్గొన్నట్లు చెప్పారు. 1930 నుండి 1991 వరకు ఆరు దశాబ్దాల పాటు పార్లమెంటు సభ్యునిగా పని చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారని తెలిపారు. తొలుత రంగా చిత్ర పటానికి ఘనంగా నివాళుల ర్పించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఎం. రమాదేవి, బి.రవీంద్రరెడ్డి, యస్.ఆర్.కోటేశ్వరరావు, కె. చంద్రశేఖర్, జయలలిత, శ్రీరేఖ, అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. విజయ్ కుమార్ పాల్గొన్నారు.


