
తీరంలో వసతులు కల్పిస్తాం
చీరాల టౌన్: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని వాడరేవు సముద్ర తీరప్రాంతానికి వచ్చే భక్తుల భద్రతకు, సౌకర్యాల కల్పనలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర్ నాయుడు చెప్పారు. కార్తిక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని తీరప్రాంతాలైన వాడరేవు, రామాపురం తీరాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా ఉన్నట్లు తెలిపారు. ఆదివారం రెవెన్యూ, పంచాయతీరాజ్, మైరెన్, అగ్నిమాపకశాఖ అధికారులు, గజ ఈతగాళ్లతో ఆర్డీవో తీరప్రాంత గ్రామాలను పరిశీలించారు. ఆర్డీఓ మాట్లాడుతూ బుధవారం నుంచి కార్తిక మాసం ప్రారంభం అవుతున్నందున అధిక సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు వాడరేవు, రామాపురం ప్రాంతాలకు వస్తున్నందున పర్యాటకుల భద్రత కోసం గజ ఈతగాళ్లు, ప్రత్యేక ప్రాంతాల్లోనే స్నానాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండలంలోని వాడరేవు గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్‌పోస్టుకు కేటాయించిన సిబ్బందికి పలు సూచనలు అందించారు. అలానే గజ ఈతగాళ్లుతో కలిసి ఏటీవీ బైక్ ద్వారా తీరం ఒడ్డున భక్తులకు మైకుల్లో సూచనలు అందిస్తామన్నారు. తీర ప్రాంతానికి వచ్చే భక్తులు పోలీసుల ఆంక్షలు పాటిస్తు సముద్రంలో స్నానాలు ఆచరించాలన్నారు. లోతుకు వెళ్లకుండా భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. తీరంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ కుర్రా గోపికృష్ణ, రూరల్ ఎస్సై చంద్రశేకర్, సివిల్, మైరెన్, పోలీస్, రెవెన్యూ, పంచాయితీరాజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.